ఏపీ నిట్‌లో పీసీబీ డిజైన్‌ వర్క్‌షాప్‌ | - | Sakshi
Sakshi News home page

ఏపీ నిట్‌లో పీసీబీ డిజైన్‌ వర్క్‌షాప్‌

Oct 15 2026 11:53 AM | Updated on Oct 15 2026 11:53 AM

ఏపీ నిట్‌లో పీసీబీ డిజైన్‌ వర్క్‌షాప్‌ సమగ్ర విధానాలతో అదనపు ఆదాయం రెజ్లింగ్‌ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

తాడేపల్లిగూడెం (టీఓసీ) : ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ రంగాల్లో నూతన ఆవిష్కరణలకు ప్రింటెడ్‌ సర్క్యూట్‌ బోర్డు (పీసీబీ) రూపకల్పన కీలకమని ఏపీ నిట్‌ ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ విభాగాధిపతి డాక్టర్‌ ఫణికృష్ణ కర్రి తెలిపారు. ఏపీ నిట్‌లో డీఎస్‌ఐఆర్‌–సీఆర్‌టీడీహెచ్‌ ఆధ్వర్యంలో, ఐఐటీ హైదరాబాద్‌, పీఈఈసీ రిసెర్చ్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ సహకారంతో రెండు రోజుల పాటు నిర్వహించనున్న పీసీబీ డిజైన్‌ వర్క్‌షాప్‌ బుధవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఫణికృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ప్రాయోగిక అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ఫ్యాకల్టీ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ అల్లంశెట్టి శ్రీకాంత్‌ మాట్లాడుతూ పీసీబీ రూపకల్పనలో కచ్చితత్వం అవసరమని, దీని ద్వారా ఎలక్ట్రానిక్స్‌, ఆటోమేషన్‌ రంగాల్లో మెరుగైన అవకాశాలు పొందవచ్చని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు నిపుణులు విద్యార్థులకు పీసీబీ తయారీపై ప్రాథమిక సూత్రాలను వివరించి, వారి సందేహాలను నివృత్తి చేశారు.

బుట్టాయగూడెం: డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని వెంకటరామన్నగూడెం కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) ఆధ్వర్యంలో సమగ్ర వ్యవసాయ విధానాలు – అదనపు ఆదాయ మార్గాలు అనే అంశంపై బుధవారం సీతాప్పగూడెం గ్రామంలో ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రైతు ముంగిట్లో ఉద్యాన శాస్త్రవేత్తలు ఫ్లాగ్‌షిప్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా దత్తత తీసుకున్న ఈ గ్రామంలో రైతులకు ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కల్పించారు. మత్స్య, పశువైద్య విభాగం ఇన్‌ఛార్జ్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ ఎ.దేవీవరప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ రైతులు కేవలం ఒకే పంటపై ఆధారపడకుండా పశుపోషణ, కోళ్ళ పెంపకం, చేపల పెంపకం వంటి అనుబంధ రంగాలను సమగ్రంగా చేపడితే స్థిరమైన అదనపు ఆదాయాన్ని పొందవచ్చని తెలిపారు. ఉద్యాన విభాగ శాస్త్రవేత్త డాక్టర్‌ ఇ.రేఖ మాట్లాడుతూ తోటల పెంపకంలో అంతర పంటలు, సమగ్ర తెగుళ్ల యాజమాన్యం గురించి వివరించారు. అనంతరం సమూహ చర్చలో సాగు సమస్యలు, తెగుళ్ల నివారణ, మార్కెటింగ్‌ అవకాశాలపై రైతులు అడిగిన ప్రశ్నలకు శాస్త్రవేత్తలు తగిన సలహాలు అందించారు.

దెందులూరు: పల్నాడు జిల్లా కారంపూడి ఉన్నత పాఠశాలలో ఈ నెల 10 నుంచి 12 వరకు జరిగిన రాష్ట్రస్థాయి స్కూల్‌ గేమ్స్‌ రెజ్లింగ్‌ పోటీల్లో ఏలూరు జిల్లా, కండ్రిగగూడెం ఉన్నత పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి సిల్వర్‌ మెడల్స్‌ సాధించారు. 17 సంవత్సరాల ఫ్రీ–స్టైల్‌ విభాగంలో కండ్రిగగూడెం ఉన్నత పాఠశాల విద్యార్థి ఎ. సాయిసుధీర్‌ రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానం సాధించి సిల్వర్‌ మెడల్‌ కై వసం చేసుకున్నారు. అలాగే, గ్రీకో–రోమన్‌ స్టైల్‌ విభాగంలో జెడ్పీహెచ్‌ఎస్‌ కండ్రిగగూడెం విద్యార్థి ఎ. క్రాంతి ద్వితీయ స్థానంలో నిలిచి సిల్వర్‌ మెడల్‌ సాధించారు. విజేతలను పాఠశాల ఫిజికల్‌ డైరెక్టర్‌ ఎం. కృష్ణారావు, ఉపాధ్యాయులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement