ఏయూ క్యాంపస్: విశాఖ సాగర తీరంలో బుధవారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. ఏలూరులోని కొల్లూరు గ్రామానికి చెందిన 10 మంది కుటుంబ సభ్యులు ఆర్కే బీచ్‌కు ఉదయం 10 గంటలకు వచ్చారు. సముద్రస్నానానికి దిగారు. 11 గంటల సమయంలో 7వ తరగతి చదువుతున్న భలే రాజేష్(13) అలల తాకిడికి కొట్టుకుపోతున్నాడు. దీనిని గమనించిన పోర్ట్ సీఎస్పీఎస్ హెడ్ కానిస్టేబుల్ జీఎం నాయుడు వెంటనే జీవీఎంసీ గజ ఈతగాడు తెడ్డు పాల్‌రాజును అప్రమత్తం చేశారు. రాజేష్‌ను కాపాడి ఒడ్డుకు చేర్చారు. అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నందున కౌన్సెలింగ్ ఇచ్చి, ఆ అబ్బాయిని తల్లిదండ్రులకు అప్పగించారు.
తణుకు అర్బన్ : తణుకు ఎస్‌కేఎస్‌డీ మహిళా కళాశాల ప్రాంగణంలో గురువారం నుంచి ఈ నెల 18వ తేదీ వరకు యోనెక్స్ సన్‌రైజ్ శ్రీ చిట్టూరి సుబ్బారావు మెమోరియల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబ్ జూనియర్ (అండర్–17) బాలుర, బాలికల బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు టోర్నమెంట్ కమిటీ చైర్మన్ చిట్టూరి వెంకట కృష్ణారావు తెలిపారు. ఈ టోర్నమెంట్‌కు రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 300 మంది క్రీడాకారులు హాజరవుతారని చెప్పారు. క్రీడాకారులకు అవసరమైన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
భీమవరం: భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని రైలు ఢీకొని సుమారు 30 ఏళ్ల వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. స్టేషన్ మాస్టర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్సై సుబ్రహ్మణ్యం వెల్లడించారు.
బుట్టాయగూడెం: ద్విచక్రవాహనాన్ని మోటార్‌సైకిల్ ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన జీలుగుమిల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బుట్టాయగూడెం మండలం సూరపువారిగూడెం గ్రామానికి చెందిన బోయినపల్లి సాంబశివరావు (55) వ్యక్తిగత పని నిమిత్తం తన ద్విచక్రవాహనంపై జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్తున్నారు. ఆ సమయంలో పోలీస్ స్టేషన్ సమీపంలో జాతీయ రహదారిపైకి రాగానే, ఎదురుగా వచ్చిన కారు ఆయన వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాంబశివరావును స్థానికులు వెంటనే జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాళ్ల: వరి సాగులో తెల్ల కంకి పురుగు ఆశిస్తుదని, రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ అధికారులు తెలిపారు. కాళ్ల మండలం కోపల్లె గ్రామంలో రైతుల వరి పొలాలను ఉండి కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా కేవీకే కోఆర్డినేటర్ డా. వినయలక్ష్మి, శాస్త్రవేత్త డా. ఎన్. శ్రీనివాసరావు, మండల వ్యవసాయ అధికారి పి. రమేష్ నాయుడు, కె. మౌనిక తదితరులు రైతులతో కలిసి పొలాలను పరిశీలించారు. వరి పొలంలో తెల్ల కంకి లక్షణాలను గుర్తించి, ఆ పురుగు జీవిత చక్రం, నష్టపోయే విధానం, నివారణ చర్యలపై రైతులకు అవగాహన కల్పించారు. తెల్ల కంకి నివారణకు క్లోరాంట్రానిలిప్రోల్ 18.5 శాతం మందును ఎకరాకు 60 మి.లీ. చొప్పున ఉపయోగించాలని సూచించారు. పురుగు ఉధృతి పెరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, రైతులు ఎప్పటికప్పుడు పంటను పరిశీలిస్తూ శాసీ్త్రయ పద్ధతులు పాటించడం ద్వారా నష్టాలను తగ్గించుకోవచ్చని వారు పేర్కొన్నారు.


