తణుకు అర్బన్: మహిళలను కించపరిచే విధంగా ఏబీఎన్ చానల్‌లో రాధాకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలు దారుణమని వైఎస్సార్ సీపీ నేతలు ధ్వజమెత్తారు. వెంటనే ఆ వ్యాఖ్యలను రాధాకృష్ణ వెనక్కి తీసుకోకపోతే మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. రాధాకృష్ట వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేస్తూ బుధవారం తణుకు నరేంద్ర సెంటర్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ సభ్యసమాజం తలదించుకునేలా ఒక తల్లి, అక్క, చెల్లి, భార్యగా ఉన్న మహిళలను అవమానపరిచే విధంగా రాధాకృష్ణ మాట్లాడడం దుర్మార్గమని అన్నారు. అమరావతి రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చుచేసే కంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను మావిగన్ కారిడార్‌గా మలచాలంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన విన్నపం ప్రజలకు చేరువైంది. ఇది తట్టుకోలేక సీఎం చంద్రబాబుకు బినామీ అయిన ఏబీఎన్ రాధాకృష్ణ ఈ నీచ జర్నలిజానికి ఒడిగట్టాడని మండిపడ్డారు. ఏబీఎన్ రాధాకృష్ణ వ్యవహారం అందరికీ తెలుసునని అన్నారు.
తక్షణమే క్షమాపణ చెప్పాలి
రాధాకృష్ణ వ్యాఖ్యలను మహిళలంతా ఛీకొడుతున్నారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. మహిళలపై మీకు గౌరవం ఉంటే వెంటనే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిన విధంగా మావిగన్ కారిడార్‌గా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను అభివృద్ధి చేస్తే సుమారుగా రూ.10 వేల కోట్లతోనే ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని దీంతో పరిశ్రమలు కూడా వస్తాయని అన్న వ్యాఖ్యలకు డైవర్షన్‌గా ఇంతకు దిగజారుతావా అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు సంపద సృష్టిస్తామని వచ్చి 18 నెలల కాలంలోనే 2 లక్షల కోట్లు పైగా అప్పులు చేసి ఏం చేశారని అన్నారు. సంపద సృష్టించడమంటే జగన్‌కే దక్కిందని పోర్టుల నిర్మాణం, మెడికల్ కళాశాలలు, భవన నిర్మాణాలు కనిపిస్తాయని గుర్తుచేశారు.
మాట్లాడుతున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు
తణుకులో ఆంధ్రజ్యోతి పేపర్లు చించుతూ నిరసన తెలుపుతున్న మాజీ మంత్రి కారుమూరి, పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రసాదరాజు
మహిళలంటే చులకన భావంతో నీచమైన జర్నలిజాన్ని నడుపుతున్న ఏబీఎన్ ఛానల్‌ను మహిళలు చీదరించుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు గూడూరి ఉమాబాల అన్నారు. ఎమ్మెల్సీ కవురు శ్రీనివాసు, సీఈసీ సభ్యుడు కొట్టు వెంకట నాగు, భీమవరం పార్టీ ఇన్‌చార్జ్ చినమిల్లి వెంకటరాయుడు, పాలకొల్లు ఇన్‌చార్జ్ గుడాల గోపి, పార్లమెంట్ సెక్రటరీ యడ్ల తాతాజీ, ఎంబీసీ మాజీ చైర్మన్ పెండ్ర వీరన్న తదితరులు ఏబీఎన్ వ్యాఖ్యలకు నిరసనగా ఫ్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. కార్యక్రమంలో పార్టీ తణుకు పట్టణ అధ్యక్షుడు మారిశెట్టి శేషగిరి, వెలగల సాయిబాబారెడ్డి, వడ్లూరి సీతారాం, పొట్ల సురేష్, యిండుగపల్లి బలరామకృష్ణ, జల్లూరి జగదీష్, మెహర్ అన్సారీ, నూకల కనకదుర్గ, పెనుమాల రాజేష్, జంగం ఆనంద్‌కుమార్, ఎస్వీ జాకబ్‌బాబు, డీజే అమూల్యారావు, గెద్దా శ్రీకాంత్, యారబాటి రామకృష్ణ, షేక్ జిలానీ, బిరుదుకోట చింతన్న, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
మావిగన్ డైవర్షన్ కోసమే మహిళలపై అనుచిత వ్యాఖ్యలు
ఏబీఎన్ రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలి
లేకుంటే మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదు
మాజీ మంత్రి కారుమూరి, పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి హెచ్చరిక
తణుకులో వైఎస్సార్ సీపీ నేతల నిరసన


