గర్బిణుల ప్రాణాలతో చెలగాటం | - | Sakshi
Sakshi News home page

గర్బిణుల ప్రాణాలతో చెలగాటం

Apr 8 2026 8:26 AM | Updated on Apr 8 2026 8:26 AM

తీరు మారకుంటే ముట్టడిస్తాం

ఆరు నెలల నుంచి తిరుగుతున్నా

ఏలూరు టౌన్‌: వైద్యులను దేవుడితో సమానంగా గౌరవిస్తూ ఉంటారు... ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్‌కు వెళితే వైద్యుడు తన ప్రాణాలను కాపాడతారనే నమ్మకంతో ఉంటారు. ఏలూరు సర్వజన ఆసుపత్రిలోని మాతాశిశు విభాగం (ఎంసీహెచ్‌)లో గర్భిణుల ప్రాణాలతో చెలగాటం ఆడుతుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. నవమాసాలు మోసి... పండంటి బిడ్డకు జన్మనిస్తున్న గర్భిణుల ప్రాణాలకు భరోసా లేకుండా పోతుందంటూ బంధువులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకటీ...రెండో కాదు ఏకంగా పదుల సంఖ్యలో నిత్యం ఇదే తరహా తంతు సాగుతున్నా... జిల్లా స్థాయి అధికారులు సైతం ఏమీ చేయలేకపోవడంపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తం అవుతుంది. గర్భిణులకు ఆపరేషన్లు చేయగా... కుట్లు విడిపోవటం, తీవ్ర ఇన్‌ఫెక్షన్లతో అనారోగ్యం బారినపడటం, ప్రాణాపాయ స్థితి ఎదుకావడం ఇక్కడ సర్వసాధారణ అంశంగా మారిపోయింది.

ప్రాణాలంటే... నిర్లక్ష్యమా ?

ఏలూరు జీజీహెచ్‌లోని ఎంసీహెచ్‌ విభాగం వైద్యులు, వైద్య సిబ్బందికి మనుషుల ప్రాణాలంటే లెక్కలేదనీ... తీవ్ర నిర్లక్ష్యం కారణంగానే గర్భిణుల ఆపరేషన్ల విషయంలో విఫలం అవుతున్నారని అంటున్నారు. గత ఏడాది కాలంలో సుమారు 50 నుంచి 60మందికి పైగా గర్భిణులు ప్రాణాపాయ స్థితిని ఎదుర్కొంటూ హాస్పిటల్‌ నుంచి బలవంతంగా బయటకు వెళ్లిపోవటం పరిస్థితికి అద్దం పడుతుంది. తాజాగా ఎంసీహెచ్‌ బ్లాక్‌లో నిడిగట్టు మౌనిక, కొడాలి సుప్రియ, వెన్నెల, పెనుమాల రమ్య, లావణ్య ఇలా గర్బిణిలు వైద్యులు, సిబ్బంది అలసత్వంతో అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆపరేషన్‌ చేసిన అనంతరం కనీసం కుట్లు సరిగ్గా వేయకపోవటంతో కుట్లు విడిపోయి, తీవ్ర ఇన్‌ఫెక్షన్‌తో విలవిల్లాడుతున్నారు. పోనీ బయటకు వెళ్ళి వేరే హాస్పిటల్‌లో వైద్య చికిత్స చేయించుకుందామని అనుకుంటే... డిశ్చార్జ్‌ చేయకుండా వైద్య సిబ్బందితో బెదిరింపులకు పాల్పడడం నిత్య కృత్యంగా మారిపోయిందనే ఆరోపణలు ఉన్నాయి.

ఎంసీహెచ్‌ బ్లాక్‌ వద్ద ఆందోళన

ఏలూరు జీజీహెచ్‌లోని ఎంసీహెచ్‌ బ్లాక్‌ వద్ద గర్భిణులపై వైద్యులు, వైద్య సిబ్బంది తీరుకు నిరసనగా మాలమహానాడు రాష్ట్ర నాయకులు అబ్బూరి అనిల్‌ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బాధితుల తరఫున ఆందోళనకు దిగారు. హాస్పిటల్‌ గేటు వద్ద బైఠాయించి బాధితుల బంధువులు, యువతతో కలిసి ధర్నా చేశారు. ప్రజలకు సరైన వైద్యం చేయకుండా నిర్లక్ష్యం వహిస్తూ అధికారులు చర్యలు చేపట్టకపోవటంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతోమంది పేదవర్గాల మహిళలు ప్రసూతి కోసం జీజీహెచ్‌కు వస్తుంటే... ఇలా ప్రాణాలతో చెలగాటం ఆడటం దారుణమంటూ నిరసన తెలిపారు.

పీజీలతో వైద్యం చేయిస్తూ...చోద్యం చూస్తున్న అధికారులు

కుట్లు విడిపోయి... ఇన్‌ఫెక్షన్లతో తీవ్ర అనారోగ్యం

ఏలూరు జీజీహెచ్‌లో వైద్యసేవలపై తీవ్ర అసంతృప్తి

ఏలూరు జీజీహెచ్‌లో వైద్యులు, సిబ్బంది తీరు దారుణంగా ఉంది. పేద మహిళలు ప్రసూతికి వస్తే ... తిరిగి ఇంటికి క్షేమంగా వెళ్లే పరిస్థితి లేకుండా చేస్తున్నారు. రెండు, మూడు సార్లు కుట్లు వేయటానికి వాళ్ళు మనుషులేనా ? అంటూ మండిపడ్డారు. కుట్లు విడిపోయి ఇన్‌ఫెక్షన్లతో బాధపడుతూ ఉంటే కనీస వైద్యచికిత్స చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆపరేషన్‌ చేశాక 20 నుంచి నెలరోజుల వరకూ హాస్పిటల్‌లోనే ఉంచుతూ... మందులు బయటకు రాస్తూ వ్యాపారం చేస్తున్నారు. – అబ్బూరి అనిల్‌, మాలమహానాడు, రాష్ట్ర నాయకులు

నేను కడుపులో నొప్పితో సుమారు ఆరునెలల నుంచీ ఏలూరు జీజీహెచ్‌కు తిరుగుతూ ఉన్నా. మేము ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి చూపించుకునే స్తోమత లేక జీజీహెచ్‌కు వస్తే... ఇక్కడ వైద్యులు కనీసం చేయి పట్టుకుని కూడా చూడలేదు. రక్త పరీక్షలు పేరుతో తిప్పుతూ ఉన్నారు. కడుపులో గడ్డలు ఉన్నాయంటారు.. కానీ చికిత్స మాత్రం చేయడం లేదు. పేదలకు సరైన వైద్యం అందే పరిస్థితి కనిపించడం లేదు. ఆసుపత్రి అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలి.

– దానం భవానీ, తంగెళ్లమూడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement