కేజీఆర్‌ఎల్‌లో అంతర్జాతీయ సదస్సు
భీమవరం: భీమవరం పట్టణంలోని కేజిఆర్‌ఎల్ కళాశాలలో ఈ నెల 27, 28 తేదీలలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఇన్నోవేషన్‌న్స్ ఇన్ ఆక్వాటిక్ హెల్త్ ఫ్యూచర్ ఫర్‌ఫెక్టివ్స్ అండ్ సస్టయినబుల్ మైరెన్ ఎన్విరాన్మెంట్ అంశంపై అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు కళాశాల అధ్యక్ష, కార్యదర్శులు కొటికలపూడి గోవిందరావు, మెంటే రామ్‌మనోహర్ చెప్పారు. శనివారం కళాశాలలో సదస్సుకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించిన సందర్బంగా వివరాలను వెల్లడించారు. సదస్సుకు ఆదికవి నన్నయ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్, ప్రొఫెసర్స్, గ్లోబల్ ఆర్‌అండ్‌డీ డిపార్ట్‌మెంట్, ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ విశ్వవిద్యాలయం ప్రతినిధులు హాజరవుతారన్నారు.
తాడేపల్లిగూడెం రూరల్: మండలంలోని ఉప్పరగూడెంలో ఈ నెల 14, 15, 16 తేదీల్లో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు అంబేడ్కర్ కమిటీ సభ్యులు తెలిపారు. శనివారం ప్రకటన విడుదల చేశారు. 14న మధ్యాహ్నం 12 గంటలకు ముగ్గుల పోటీలు జరుగుతాయన్నారు. కబడ్డీ పోటీల్లో పాల్గొనే టీమ్‌లు ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న టీంలకు భోజన వసతి కల్పించనున్నట్లు తెలిపారు. పోటీల్లో గెలుపొందిన టీమ్‌లకు ప్రథమ బహుమతి రూ.20వేలు, ద్వితీయ బహుమతిగా రూ.15వేలు, తృతీయ బహుమతిగా రూ.10వేలు, నాల్గవ బహుమతిగా రూ.7వేలు అందించనున్నట్లు వివరించారు.
భీమవరం: భీమవరం పట్టణంలోని ఆర్యవైశ్య యువజన సంఘం భవనంలో ఈ నెల 11న శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి రాష్ట్ర ర్యాపిడ్ చెస్ పోటీలు అనసూయ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు చెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మాదాసు కిషోర్ చెప్పారు. ఆదివారం ఉదయం 9 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయన్నారు. స్పేస్ లీగ్ నిర్వహించే పోటీల్లో విజేతలకు రూ.30 వేల విలువైన చెస్ పుస్తకాలను బహుమతులుగా అందచేస్తామన్నారు.
ద్వారకాతిరుమల: సంక్రాంతి పండుగ పనుల్లో ప్రజలు బిజీబిజీగా ఉన్నారు. దాంతో శ్రీవారికి ప్రీతికరమైన శనివారం ద్వారకాతిరుమల క్షేత్రానికి భక్తులు నామమాత్రంగా విచ్చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయంలో సాధారణ భక్తుల రద్దీ కొనసాగింది. దర్శనం క్యూలైన్లు, ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, అనివేటి మండపం, కేశఖండనశాల, ప్రసాదాల కౌంటర్లలో భక్తుల రద్దీ అంతంత మాత్రంగానే కనిపించింది.
భీమడోలు : పొలసానిపల్లి పొలాల్లోని ట్రాన్స్‌ఫార్మర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన ఘటన శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. ట్రాన్స్‌ఫార్మర్‌లోని విలువైన కాపర్ వైర్లు దొంగిలించి పరారయ్యారు. భీమడోలు నుంచి ద్వారకాతిరుమలకు వెళ్లే రహదారి పక్కనే ఉన్న పొలసానిపల్లి రైతు మిరియాల సత్యనారాయణ తన వ్యవసాయ భూమిలోని ట్రాన్స్‌ఫార్మర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసి అందులోని వేలాది రూపాయల కాపర్ వైర్‌ను తీసుకుని పరారయ్యారు.


