కారుమూరిని కించపరిచేలా ఫ్లెక్సీలు
అత్తిలి: అత్తిలి మండలం ఉరదాళ్లపాలెంలో కూటమి నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదానికి దారితీసింది. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును కించపరుస్తూ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంపై వైఎస్సార్ సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. గ్రామంలో నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభోత్సవం సందర్భంగా కూటమి నేతలు దారి పొడవునా ఆర్‌అండ్‌బీ మంత్రికి స్వాగతం పలికే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వీటితో పాటు మూడు ప్రాంతాలలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మాజీ మంత్రి కారుమూరి ఫొటో కింద రోత రాతలు రాశారు. ఈ ఫ్లెక్సీల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర లీగల్ సెల్ అధికారి ప్రతినిధి వెలగల సాయిబాబారెడ్డి, వైఎస్సార్‌సీపీ శ్రేణులు శనివారం రాత్రి ఆందోళన చేపట్టారు. ఎట్టకేలకు పోలీసులు, పంచాయతీ సిబ్బంది ఆ మూడు ఫ్లెక్సీలను తొలగించడంతో వైఎస్సార్‌సీపీ నాయకులు శాంతించారు. వివాదాస్పద ఫ్లెక్సీల ఏర్పాటుపై వార్డు సభ్యుడు చవ్వాకుల వేణు, తణుకు ఏఎంసీ చైర్మన్ కొండేటి శివపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయగా, విచారణ జరుపుతామని ఎస్సై ప్రేమరాజు తెలిపారు.
వైఎస్సార్‌సీపీ శ్రేణుల ఆందోళనతో తొలగింపు


