గిరి ప్రదక్షిణకు సర్వం సిద్ధం
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో స్వామి గిరి ప్రదక్షిణకు, ఉత్తర ద్వార దర్శనానికి సర్వం సిద్ధమైంది. ఏటా ముక్కోటి ఏకాదశి పర్వదినం ముందు రోజు గిరి ప్రదక్షిణను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ క్రమంలోనే ఈ సారి కూడా ఈ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 5 కిలోమీటర్ల మేర జరిగే గిరి ప్రదక్షిణలో పాల్గొనే గోవింద స్వాములు, భక్తుల పాదాల రక్షణకు మార్గంలో ఎండు గడ్డిని పరిచారు. దారి పొడవున టెంట్లు నిర్మించి, ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేశారు. గిరి ప్రదక్షిణ మహోత్సవం సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు స్వామివారి తొలిమెట్టు (పాదుకా మండపం) వద్ద ప్రారంభం అవుతుంది. గజ, అశ్వ, వృషభ సేవలు, చిత్రవిచిత్ర వేషధారణలు, డప్పు వాయిద్యాలు, కోలాట నృత్యాల నడుమ ఈ గిరి ప్రదక్షిణ మల్లేశ్వరం(దొరసానిపాడు రోడ్డు) మీదుగా గిరి చుట్టూ తిరిగి ఆలయానికి చేరుతుంది. ఉత్తర ద్వార దర్శనానికి దాదాపుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. క్యూలైన్ల వద్ద షామియానా పందిళ్లు నిర్మించారు. సప్తగోకులం పక్కన ఉత్తర ద్వార దర్శనం స్వాగత ద్వారం ఏర్పాటు చేశారు. విద్యుద్దీప అలంకారాలు పూర్తి కాగా.. క్షేత్రం కాంతులీనుతోంది. ధర్మప్రచార రథాన్ని ముస్తాబు చేస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున 5 గంటల నుంచి శ్రీవారు దర్శనమిచ్చే ఉత్తర ద్వారం వద్ద పూల అలంకరణ పనులు సోమవారం సాయంత్రం నుంచి ప్రారంభం కానున్నాయి.
సేవకు సిద్ధం
గిరి ప్రదక్షిణ, ఉత్తర ద్వార దర్శనంలో పాల్గొనే భక్తులకు సేవలందించేందుకు 400 మంది సేవకులు సిద్ధంగా ఉన్నారు. గిరి ప్రదక్షిణలో దారి పొడవున భక్తులకు మంచినీరు, బిస్కెట్లు, పండ్లు, పాలను అందించనున్నారు. గిరి ప్రదక్షిణ, ఉత్తర ద్వార దర్శనంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలోని 110 మంది పోలీస్ సిబ్బందిని ఈ ఉత్సవాల్లో నియమిస్తున్నారు.
నేటి రాత్రి నుంచి నిజరూప దర్శనం..
గిరి ప్రదక్షిణ అనంతరం భక్తులకు శ్రీవారి నిజరూప దర్శన భాగ్యం కలగనుంది. ఏడాదిలో ఒకసారి మాత్రమే స్వామివారు ఎలాంటి అలంకరణలు లేకుండా, దీపపు వెలుగుల్లో భక్తులకు దర్శనమిస్తారు. ఈ దర్శనం సోమవారం రాత్రి 7 గంటల నుంచి మంగళవారం సాయంత్రం వరకు ఉంటుంది.
గిరి ప్రదక్షిణ మార్గంలో పరిచిన ఎండు గడ్డి
దారి పొడవునా టెంట్‌లు, ఫ్లడ్ లైట్ల ఏర్పాటు
నేడు రాత్రి 7 గంటల నుంచి స్వామి నిజరూప దర్శనం
110 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు
గిరి ప్రదక్షిణకు సర్వం సిద్ధం
గిరి ప్రదక్షిణకు సర్వం సిద్ధం


