‘పోలవరం’ లేకుండానే కొత్త జిల్లా
బుట్టాయగూడెం: జిల్లాల పునర్విభజన నేపథ్యంలో రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న కసరత్తు కొలిక్కి వచ్చింది. గత నెల 27న తొలి నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగానే చింతూరు, రంపచోడవరం డివిజన్ల పరిధిలో ఉన్న 11 మండలాలతో రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటుకు ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసి ఆయా ప్రాంతాల ప్రజల అభ్యంతరాలు తెలిపేందుకు నెల రోజులు వ్యవధి ఇచ్చింది. ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను సీఎం సమీక్షించిన అనంతరం పోలవరం జిల్లా ఏర్పాటులో ఎలాంటి మార్పులు, చేర్పులు లేవని ప్రాథమికంగా ప్రభుత్వం తెలిపింది. దీనితో పోలవరం లేకుండానే రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించి ఈ నెల 31న తుది నోటిఫికేషన్ జారీ కానుంది. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న పోలవరం జిల్లా పోలవరం లేకుండా ఏర్పాటు చేయడంపట్ల నియోజకవర్గంలోని మండలాల్లో గిరిజన సంఘాల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. తమ అభిప్రాయాలను తెలియజేస్తూ పలువురు నాయకులు కలెక్టర్ కె. వెట్రిసెల్వికి, ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు అందజేశారు. అభ్యంతరాల గడువు ముగియడంతో వాటిని పరీశీలించిన ప్రభుత్వం డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ విడుదల చేయనుంది.


