రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
తణుకు అర్బన్ : తుని జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తణుకు పట్టణానికి చెందిన యువకుడు మృతిచెందాడు. తణుకులోని అపోలో ఫార్మసీలో పనిచేస్తున్న వరాడ సుధీర్ (32) స్నేహితులతో కలిసి విశాఖపట్టణం నుంచి కారులో వస్తుండగా ఆగి ఉన్న ఇనుప చువ్వల లారీని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనలో సుధీర్‌తోపాటు మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు. సుధీర్ మృతితో తణుకులో విషాద చాయలు అలముకున్నాయి.
పోక్సో కేసు నమోదు
భీమవరం : బాలికను ప్రేమ పేరుతో మోసం చేసినట్లు ఫిర్యాదు మేరకు ముగ్గురిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు భీమవరం టూటౌన్ సీఐ జి.కాళీచరణ్ చెప్పారు. కాళ్ల మండలం బొండాడ గ్రామానికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన బందెల షాలిమ్ ప్రేమిస్తున్నానంటూ వెంటపడగా ముందు తిరస్కరించింది. కుసుమే ప్రవీణ్‌తో షాలిమ్ రాయబారం నడపడంతో బాలిక ప్రేమకు అంగీకరించింది. షాలిమ్ ఈ ఏడాది జనవరి 16న మాయమాటలు చెప్పి భీమవరం పట్టణంలోని లాడ్జికి తీసుకెళ్లాడు. ఆ విషయాన్ని షాలిమ్ బొండాడ గ్రామానికి చెందిన ఎం.బాలుకు చెప్పడంతో, ఈ ఏడాది మార్చి 27న బాలికను షాలిమ్ తీసుకురమ్మంటున్నాడని చెప్పి అదే లాడ్జికి తీసుకువెళ్లి బాలు బలవంతం చేశాడు. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కాళీచరణ్ తెలిపారు.
మంచి సినిమా కథలకు ఆదరణ
సినీ రచయిత అబ్బూరి రవి
భీమవరం (ప్రకాశంచౌక్): సినిమా క్వాలిటీ రేంజ్ పెరిగిందని, మంచి కథలకు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తుందని సినీ మాటల రచయిత అబ్బూరి రవి అన్నారు. ట్రైలర్‌లు.. సినిమా పోస్టర్లను చూసి ఇది ఓటీటీ.. ఇది థియేటర్ సినిమా అనే చెప్పే పరిస్థితి నెలకొందని చెప్పారు. ప్రస్తుతం అడవి శేషుతో డెకాయిట్ చిత్రం చేస్తున్న ఆయన శనివారం భీమవరం విచ్చేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తనది భీమవరమేనని, త్రివిక్రమ్‌తో స్నేహమే సినిమా మాటల రచయితగా మార్చిందన్నారు.
తండ్రిని చంపిన కొడుకు అరెస్టు
దెందులూరు: తండ్రిని చంపిన కొడుకును దెందులూరు ఎస్సై శనివారం అరెస్ట్ చేశారు. మండలంలోని ఉండ్రాజవరం గ్రామంలో అంబల్ల సింహాచలంపై పెద్ద కుమారుడు రోకలిబండతో శుక్రవారం దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సింహాచలం మరో కుమారుడు శనివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్సై శివాజీ వివరించారు.


