మీనం.. ధర పతనం

- - Sakshi

సాక్షి, భీమవరం: ప్రభుత్వానికి డాలర్ల పంట పండించే రొయ్యల రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు చేపల సాగు ఆదుకునేది. ప్రస్తుతం చేపల ధరలు తగ్గి మేత ధరలు ఒక్కసారిగా పెరగడంతో ఆక్వా రైతులు కలవరపడుతున్నారు. చేపలను దిగుమతి చేసుకునే దేశాల్లో చేపల ఉత్పత్తి పెరగడం, ఇక్కడ నుంచి ఎగుమతి అయ్యే చేపలు వాసన వస్తున్నాయంటూ దిగుమతులపై ఆంక్షలు విధించడంతో గత నెల రోజులుగా చేపల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 2.50 లక్షల ఎకరాలో ఆక్వా సాగు చేస్తుండగా, దీనిలో దాదాపు 1.70 లక్షల ఎకరాల్లో చేపల సాగు చేస్తున్నారు. జిల్లాలో కార్పోరేట్‌ ఫిష్‌ కల్చర్‌ ప్రారంభం కావడంతో భూములను లీజుకు తీసుకుని చేపల సాగు చేస్తున్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేపల సాగులో ఎకరాకు ఏడాదికి సుమారు 4 టన్నుల వరకు చేపల దిగుబడి వస్తుండగా ఇక్కడి చేపలను అస్సాం, పశ్చిమబెంగాల్‌, బీహార్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌ తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. ప్రతి రోజు 200 లారీల చేపలు ఎగుమతి అవుతుంటాయి.

డీఓబీ కిలో ధర రూ.19 నుంచి 23కు పెంపు
జిల్లాలో రైతులు ఎక్కువగా శీలావతి, కట్ల, ఫంగస్‌ రకం చేపలను సాగుచేస్తుంటారు. చేపల పెంపకానికి ఎక్కువగా వినియోగించే డీఓబీ, సోయాబీన్‌, వేరుశెనగ చెక్క ధరలకు ఒక్కసారిగా పెరిగిపోయాయని రైతులు చెబుతున్నారు. డీఓబీ గతంలో కిలో ధర రూ.14 ఉండగా ప్రస్తుతం రూ.19 నుంచి రూ.23 వరకు పెరిగింది. అలాగే వేరుశెనగచెక్క కిలో గతంలో రూ.35 ఉండగా ప్రస్తుతం రూ.43 పెరిగింది. ఇది ఇలా ఉండగా చేపల ధరలు మాత్రం పెరగకపోక పోగా మరింత తగ్గాయని రైతులు వాపోతున్నారు. గతంలో ఫంగస్‌ చేప కిలో రూ.80 వరకు విక్రయాలు చేయగా, ప్రస్తుతం రూ.74, శీలావతి, కట్ల రకం చేపలు కిలో రూ.100 మాత్రమే ధర పలుకుతున్నాయని చెబుతున్నారు.

చేపల సాగుతో లాభాల సంగతి అటుంచి నష్టాలను చవిచూడాల్సివస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో రొయ్యల ధరలు తగ్గితే చెరువుల్లో చేపలు పెంచి ఎంతో కొంత నష్టాలను అధిగమించేవారమని, ప్రస్తుతం చేపల సాగు అంటేనే భయపడాల్సి వస్తోందని చెబుతున్నారు. ఆక్వా సాగుకు ప్రభుత్వం సహకారం అందిస్తున్నా ధర లేకపోవడం, మేత ధరలు పెరగడంతో నష్టాలను అధిగమించలేకపోతున్నట్లు రైతులు చెబుతున్నారు. ఇటీవల అస్సాం వంటి రాష్ట్రాల్లో ఐస్‌ కొరత కారణంగా నిల్వ ఉంచే చేపలు వాసన రావడంతో దాని ప్రభావం మనపై పడి దిగుమతులు నిలిచిపోయినా దీనిపై విచారణ చేసిన తరువాత దిగుమతులు యథావిధిగా కొనసాగుతున్నాయని చెబుతున్నారు.

రూ.100 పైబడి ఉంటేనే ధర గిట్టుబాటు
ఆక్వా సాగుకు రాష్ట్ర ప్రభుత్వం చేయూత నిచ్చి అండగా ఉన్నప్పటికీ చేపల ధరలు తగ్గిపోవడం, మేత ధరలు పెరగడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. చేపల ధర కిలో రూ.100 పైబడి ఉంటే రైతులకు గిట్టుబాటు అవుతుంది.
– పేరిచర్ల విజయనర్సింహరాజు, చేపల రైతు, పెదగరువు, భీమవరం మండలం

నష్టాలను చవిచూస్తున్నాం
ఇటీవల చేపల ధరలు తగ్గడంతో నష్టాలను చవిచూడాల్సివస్తున్నది. దీనికితోడు చేపల మేత ధరలు పెరగడంతో రైతులకు గోరుచుట్టుపై రోకలి పోటులా పరిణమించింది. ప్రభుత్వం పూర్తిస్ధాయిలో విద్యుత్‌ సబ్సిడీ ఇస్తే రైతులకు కొంత ప్రయోజనకరంగా ఉంటుంది.
– శాయన సుపర్ణ, చేపల రైతు, ఆకివీడు

Read latest West Godavari News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top