● బల్దియా ప్రత్యేకాధికారి
చాహత్ బాజ్పాయ్
వరంగల్ అర్బన్ : జనగణన రెండో దశను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు క్షేత్రస్థాయి సిబ్బందికి సంబంధిత నిబంధనలు, ప్రశ్నావళి, సాంకేతిక అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని హనుమకొండ కలెక్టర్, బల్దియా ప్రత్యేకాధికారి చాహత్ బాజ్పాయ్ సూచించారు. మంగళవారం వరంగల్ మహానగర పాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ) ప్రధాన కార్యాలయం కౌన్సిల్ హాల్లో నగర పరిధిలోని చార్జ్ క్లర్కులు, టెక్నికల్ అసిస్టెంట్లకు జనగణన రెండో దశపై రెండు రోజుల శిక్షణలో భాగంగా మంగళవారం కలెక్టర్ హాజరై దిశానిర్దేశం చేశారు. మొదటి దశలో చేపట్టిన హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ (హెచ్ఎల్ఓ) బ్లాకులను ఎన్యుమరేషన్ బ్లాకులుగా మార్చే విధానం, వెబ్ పోర్టల్ ద్వారా చేపట్టాల్సిన సాంకేతిక ప్రక్రియలు, ఎన్యుమరేషన్ బ్లాకుల కేటాయింపు, జనాభా గణనలో ఎవరూ మినహాయింపునకు గురికాకుండా తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు ఇంటింటికీ వెళ్లి సేకరించాల్సిన వివరాలతో పాటు మొదటిదశలో ఉన్న లోపాల సవరణపై అవగాహన కల్పించారు. హైదరాబాద్ సెన్సస్ విభాగం అధికారి సీహెచ్ సతీశ్, జూనియర్ టెక్నికల్ సూపర్వైజర్ ప్రశాంత్ వెబ్పోర్టల్ వినియోగం, బ్లాకుల మార్పులు, జనాభా వివరాల నమోదు తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో సీపీఓ సత్యనారాయణ రెడ్డి, జీడబ్ల్యూఎంసీ అడిషనల్ కమిషనర్ ఇసంపల్లి జోనా, ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్ ప్రసన్న రాణి తదితరులు పాల్గొన్నారు.


