ఎల్‌నినో దెబ్బతో వానరాల వీరంగం
సాక్షి, వరంగల్: ఒకప్పుడు అడవులకే పరిమితమైన కోతులు ఇప్పుడు జనావాసాల్లో గుంపులుగా సంచరిస్తూ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇళ్లపైకి ఎక్కుతున్నాయి.. వంటగదుల్లోకి చొరబడుతున్నాయి.. చేతికందిన ఆహార పదార్థాలను ఎత్తుకెళ్తున్నాయి.. అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే మీదపడుతున్నాయి.. గోళ్లతో రక్కుతూ, పళ్లతో కరుస్తూ బెంబేలెత్తిస్తున్నాయి. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఎండల తీవ్రత పెరిగి, నీటి వనరులు ఇంకిపోయాయి. దీంతో జంతువులకు సహజసిద్ధమైన ఆహారం కరువైంది. ఈక్రమంలో ఆహారం, నీటి కోసం కోతుల గుంపులు గ్రామాలు, పట్టణాల్లోని జనావాసల్లోకి చొచ్చుకొస్తున్నాయి. అసలే కరవు పరిస్థితులు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు ఈ కోతుల దాడులు అదనపు శాపంగా మారాయి. ఇళ్లపైకి గుంపులుగా చేరి వస్తువులను ధ్వంసం చేయడం, ఎదిరిస్తే మనుషులపై, ముఖ్యంగా చిన్న పిల్లలపై దాడులకు తెగబడుతుండటంతో జనం జంకుతున్నారు. దీంతో వరంగల్ నగరమే కాదు పట్టణాలు, పల్లెల్లో వానరాల బెడదపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
కోతుల సర్వేకు ఆదేశాలు..
ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు నమోదైన వైద్య గణాంకాలు కోతుల దాడుల తీవ్రతను చాటుతున్నాయి. అయితే ఈ–పంచాయతీ పోర్టల్ ద్వారా ‘మంకీ మెనేస్ సర్వే’ చేపట్టి గ్రామాల వారీగా కోతుల వివరాలు నమోదు చేయాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. గ్రామాల్లో కోతుల ఉనికి, పంట నష్టం, ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులపై పంచాయతీ కార్యదర్శులు ఆన్‌లైన్‌లో సమాచారం నమోదు చేయాల్సి ఉంది. ఈ వివరాల ఆధారంగా సమస్య తీవ్రతను అంచనా వేసి, నియంత్రణకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. గతంలో ప్రవేశపెట్టిన మంకీ ఫుడ్ కోర్టులు సరిగ్గా పనిచేయలేదని, తక్షణమే స్టెరిలైజేషన్ (కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు) కేంద్రాన్ని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చి కోతులను అడవుల్లోకి తరలించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
అటవీ ప్రాంతాల్లో కరువైన నీరు, ఆహారం
గ్రామాలు, పట్టణాల్లో ఇళ్లలోకి చొరబడి దాడులు
9 నెలల్లో 279 మందికి కాట్లు
సెప్టెంబర్‌లో 54 కేసులు..
కోతుల బెడదపై ఆన్‌లైన్ సర్వేకు
ప్రభుత్వం ఆదేశాలు
కుక్కలు, పిల్లులతోనూ టెన్షనే..!


