ఒక్క టీచర్..
సాక్షిప్రతినిధి, వరంగల్:
ఐదు తరగతులు.. విద్యార్థులు 19 మందిలోపే.. కానీ, బోధనకు ఒక్క ఉపాధ్యాయుడు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల్లో ఇదీ పరిస్థితి. విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయ పోస్టులను నిర్ణయించే రేషనలైజేషన్ విధానం చిన్న పాఠశాలలకు భారంగా మారుతోంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 4,293 పాఠశాలలు ఉండగా.. 879 పాఠశాలల్లో సింగిల్ టీచర్ మాత్రమే పనిచేస్తున్నారు. అంటే మొత్తం 20.5 శాతం పాఠశాలల్లో ఒకే ఉపాధ్యాయుడితో బోధన సాగుతోంది. ప్రాథమికస్థాయిలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదివే 83,771 మంది విద్యార్థులపై ఈ ప్రభావం పడుతుంది.
జీఓ 25లో ఏం ఉంది?..
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటు, రేషనలైజేషన్ కోసం ప్రభుత్వం 2021 ఆగస్టు 12న జీఓ 25ను జారీ చేసింది. విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయుల సంఖ్యను నిర్ణయించే విధానం ఇందులో ఉంది. ప్రాథమిక పాఠశాలల్లో 0–19 మంది విద్యార్థులుంటే ఒక ఎస్‌జీటీ, 20–60 మందికి ఇద్దరు, 61–90 మందికి ముగ్గురు, 91–120 మందికి నలుగురు ఎస్‌జీటీలను కేటాయించాలి. విద్యార్థుల సంఖ్య పెరిగితే ఉపాధ్యాయ పోస్టుల సంఖ్య కూడా పెరుగుతుంది. అయితే 0–19 మంది విద్యార్థులున్న బడికి ఒక్క ఎస్‌జీటీ ఉండడంతో.. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఒక్కరే బోధించాల్సిన పరిస్థితి వస్తోంది.
బోధనకే సమయం కరువు..
ఐదు తరగతుల విద్యార్థులకు ఒకే సమయంలో బోధన చేయడం సింగిల్ టీచర్‌కు పెద్ద సవాల్. ఒక తరగతికి పాఠం చెబుతున్న సమయంలో మిగిలిన తరగతుల విద్యార్థులను స్వయం పఠనానికి వదిలేయాల్సి వస్తోంది. దీనికితోడు హాజరు, రికార్డుల నిర్వహణ, ప్రభుత్వ కార్యక్రమాలు, శిక్షణలు, ఎన్నికల విధులు, ఇతర శాఖల పనులు వంటి అదనపు బాధ్యతలు కూడా ఉంటున్నాయి. దీంతో బోధనకు కేటాయించాల్సిన సమయం తగ్గిపోతోంది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 879 ఏకోపాధ్యాయ పాఠశాలలు
1 నుంచి 5 తరగతి చదువుతున్న 83,771పై ప్రభావం
జీఓ 25తో ప్రాథమిక విద్యకు
‘రేషనలైజేషన్’ ఉచ్చు
ప్రతి తరగతికి ఒక టీచర్
ఉండాలంటున్న ఉపాధ్యాయ సంఘాలు
పిల్లలు తగ్గితే.. టీచర్లు తగ్గాలా?
గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి అనేక కారణాలున్నాయి. పిల్లలు తక్కువగా ఉన్న పాఠశాలల్లో ఉపాధ్యాయులను తగ్గిస్తే పరిస్థితి మరింత ప్రతికూలంగా మారే అవకాశం ఉందని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. టీచర్లు తక్కువ.. బోధనపై ప్రభావం.. విద్యా ప్రమాణాలపై తల్లిదండ్రుల్లో అనుమానాలు.. ప్రైవేట్ పాఠశాలల వైపు మొగ్గు.. ప్రభుత్వ బడుల్లో మరింతగా విద్యార్థుల సంఖ్య తగ్గడం.. ఇలా ఒక చక్రంలా మారే ప్రమాదం ఉందని పేర్కొంటున్నాయి.
జీఓ 25ను సవరించాలి
జీఓ 25 ప్రాథమిక పాఠశాలలకు ముప్పుగా పరిణమించింది. 19 లోపు విద్యార్థులుంటే ఒక్క ఉపాధ్యాయుడే ఉండాలన్న నిబంధన సరికాదు. 60 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు ఉంటే.. ప్రాథమిక స్థాయిలోని అన్ని సబ్జెక్టులను ఎలా బోధిస్తారు? వర్క్ అడ్జస్ట్‌మెంట్ పేరుతో ఎస్ జీటీలను ఉన్నత పాఠశాలలకు పంపుతున్నా రు. పాఠశాలలను బలోపేతం చేయాలి. జీఓ 25ను తక్షణమే సవరించాలి.
– పెండెం రాజు, హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి, టీఎస్‌యూటీఎఫ్


