● ఎంపికై న అభ్యర్థుల్లో ఆందోళన
కాళోజీ సెంటర్ : 2026–27 విద్యా సంవత్సరానికి గాను జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన 48 పాఠశాలల్లో ప్రీ–ప్రైమరీ తరగతులను ప్రారంభించేందుకు జూన్‌లో ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. సదరు పాఠశాలల్లో తాత్కాలిక పద్ధతిన పని చేయడానికి ‘ప్రీ–ప్రైమరీ ఇన్‌స్టక్టర్’, ‘ఆయా’ పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ డీఈఓ రంగయ్యనాయుడు జూన్‌లో ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నియామకాలు పూర్తిగా ఈ విద్యా సంవత్సరం చివరి వరకు తాత్కాలిక ప్రాతిపదికన మాత్రమే కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే మహిళలు తప్పనిసరిగా ఆయా గ్రామ పంచాయతీ, మున్సిపల్ డివిజన్ పరిధిలోనే నివాసం ఉండాలని.. స్థానికత, అభ్యర్థుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారని ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వుల ప్రకారం దరఖాస్తులను స్క్రూటినీ చేసి ఎంఈఓ, కాంప్లెక్స్ హెచ్‌ఎంలు, జిల్లా విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణలో అభ్యర్థుల ఎంపిక తుది జాబితా ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక రోజు శిక్షణ అనంతరం విధుల్లో చేరాలని రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం జిల్లాలో కూడా శిక్షణ కొనసాగింది.
మళ్లీ ఇంటర్వ్యూలు!
అభ్యర్థుల ఎంపికలో ప్రజా ప్రతినిధుల జోక్యంతో కథ అడ్డం తిరిగింది. ఐదు నెలలు గడుస్తున్నా ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. కొంత మంది అభ్యర్థులు కలెక్టర్ దృష్టికి విషయం తీసుకెళ్లడంతో మళ్లీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని చెప్పినట్లు సమాచారం. జీఓకు విరుద్దంగా శుక్రవారం మళ్లీ ఆయా మండలాల ఎంపీడీఓలు, ఎంఈఓలు, కాంప్లెక్స్ హెచ్‌ఎంలు గుట్టుచప్పుడు కాకుండా ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు తెలిసింది. దీని కారణంగా గతంలో ఎంపికై న అభ్యర్థులు ఆందోళన పడ్డారు.
ఎంపిక చేసిన జాబితా మాయం ?
ప్రీ–ప్రైమరీ బోధకులు, ఆయా అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన జాబితాను జిల్లాకు చెందిన ఓ ఉన్నతాధికారి కంప్యూటర్ నుంచి డిలీట్ చేయించినట్లు తెలిసింది. గతంలో ఎంపిక చేసిన అభ్యర్థులతోపాటు ఎంపికకాని అభ్యర్థులతో కలిపి శుక్రవారం ఇంటర్వ్యూలు నిర్వహించడంతో మొదట ఎంపికై న అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. ఈ ఎంపిక ప్రక్రియ జీఓకు అనుగుణంగా చేపట్టాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఈ విషయంపై ఫోన్‌లో వివరణ కోరేందుకు ప్రయత్నించగా డీఈఓ అందుబాటులోకి రాలేదు.


