సాక్షి, వరంగల్: జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బతుకమ్మ, దసరా పండుగ వేళ భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండ తీవ్రతకుతోడు గాలిలో తేమ శాతం (హ్యుమిడిటీ) విపరీతంగా పెరగడంతో జనం ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం నుంచే మొదలవుతున్న ఉక్కపోత రాత్రి వేళల్లోనూ కొనసాగుతుండటంతో ఇళ్లలో ఉండలేక, బయటకు రాలేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీంతో ఒక్కసారిగా ఇంట్లో ఫ్యాన్లు, ఏసీలకు డిమాండ్ పెరిగింది.
సంగెంలో అత్యధిక ఉష్ణోగ్రత..
శనివారం ఉదయం 8.30 నుంచి ఆదివారం ఉదయం 8.30 గంటల వరకు జిల్లాలోనే అత్యధికంగా సంగెం మండలంలో 36.9 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. వరంగల్ మినహా మిగిలిన అన్ని మండలాల్లోనూ ఎండ తీవ్రత భారీగా నమోదైంది. ఖిలా వరంగల్, గీసుకొండ, దుగ్గొండి, నల్లబెల్లి, నర్సంపేట, ఖానాపురం, చెన్నారావుపేట, నెక్కొండ, పర్వతగిరి, వర్ధన్నపేట, రాయపర్తి మండలాల్లో ఉష్ణోగ్రతలు 35.1 నుంచి 37 డిగ్రీల సెల్సియస్ వరకు రికార్డయ్యాయి. వరంగల్ మండలంలో కాస్త ఉపశమనం లభిస్తూ 33.1 నుంచి 35 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదైంది.
గరిష్ట స్థాయికి హ్యుమిడిటీ..
ఉష్ణోగ్రతల కంటే కూడా జిల్లా ప్రజలను హ్యుమిడిటీ (ఉక్కపోత) తీవ్రంగా వేధిస్తోంది. వరంగల్ మినహా మిగిలిన దాదాపు అన్ని మండలాల్లో గరిష్ట హ్యుమిడిటీ 90.1 శాతం నుంచి 100 శాతం వరకు నమోదైంది. గాలి ఆడని పరిస్థితి ఏర్పడటంతో చెమట పడుతూ పగలు, రాత్రి తేడా లేకుండా ప్రజలు తీవ్ర ఇబ్బందికి లోనవుతున్నారు. వరంగల్ మండల పరిధిలో మాత్రం తేమ శాతం 70.1 నుంచి 90 శాతం మధ్యగా నమోదైంది.
పండుగ వేళ జాగ్రత్తలు అవసరం..
ప్రస్తుతం దసరా పండుగ, బతుకమ్మ, దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సెలవుల కారణంగా ప్రజలు, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు బంధువుల ఇళ్లకు, దేవాలయాలకు వెళ్లేందుకు బయటకు వస్తున్నారు. ఈ తరుణంలో పెరిగిన ఉక్కపోత, ఎండలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండేందుకు ఓఆర్‌ఎస్ ద్రావణం, కొబ్బరిబొండాలు, మజ్జిగ, నిమ్మరసం వంటి ద్రవపదార్థాలను ఎక్కువగా తీసుకోవాలని, ప్రయాణాల్లో ఉన్నప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
అత్యధిక మండలాల్లో హ్యుమిడిటీ ఎఫెక్ట్
సంగెం మండంలో 36.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత
వరంగల్ మినహా మిగతా మండలాల్లో భానుడి ప్రతాపం


