వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై ఆందోళన చేస్తున్న బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు
బస్వాపురం నరసయ్య, పార్టీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్, మల్లాడి తిరుపతి రెడ్డి, గుజ్జుల
ప్రేమేందర్రెడ్డి, ధర్మారావు, శ్రీధర్ తదితరులు, బీజేపీ నాయకులను అరెస్ట్ చేస్తున్న పోలీసులు
మామునూరు: అధికారంలోకి వస్తే రైతుల సంక్షేమమే లక్ష్యమని చెప్పిన కాంగ్రెస్ నేడు రాష్ట్రంలో తుగ్లక్ పాలన చేస్తూ కరెంట్ కష్టాలు తెచ్చిందని, ఇది రైతు ప్రభుత్వం కాదని.. రాబందుల ప్రభుత్వమని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వాపురం నరసయ్య, పార్టీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్, ప్రోగ్రాం కన్వీనర్, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లాడి తిరుపతి రెడ్డి ఆరోపించారు. కరెంట్ కోతలను నిరసిస్తూ వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై తిమ్మాపురం సబ్స్టేషన్ వద్ద శుక్రవారం కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ప్లకార్డులతో సబ్స్టేషన్ ముట్టడించి..ఖమ్మం హైవేపై ధర్నా నిర్వహించారు. పలువురు కార్యకర్తలు ఎడ్లబండ్లపై తరలివచ్చారు. జాతీయ రహదారిపై గంటపాటు ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు రంగప్రవేశం చేసి పలువురు నాయకులను అరెస్టు చేసి మామునూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. మాజీ ఎమ్మెల్యేలు మార్తినేని ధర్మారావు, కొండేటి శ్రీధర్, పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, మాజీ మేయర్ టి.రాజేశ్వర్రావు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు దండు కిషన్, నాయకులు మల్లాడి రాంరెడ్డి, బన్న ప్రభాకర్ పాల్గొన్నారు.
బీజేపీ కిసాన్ మోర్చా
రాష్ట్ర అధ్యక్షుడు నరసయ్య
వరంగల్ – ఖమ్మం జాతీయ
రహదారిపై నాయకుల ధర్నా


