నల్లబెల్లి: పంటలు సాగు చేయకుండా ప్రభుత్వ పథకాలు, రాయితీలు పొందుతున్న నకిలీలను అరికట్టి, అసలైన రైతులకు లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రైతులు సాగు చేసిన పంటల వివరాలను క్షేత్రస్థాయిలో నమోదు చేసేందుకు జిల్లాలో చేపట్టిన డిజిటల్ క్రాప్ సర్వే (డీసీఎస్) చివరి దశకు చేరుకుంది. 94 శాతం సర్వే పూర్తి చేసి నెక్కొండ మండలం మొదటి స్థానంలో ఉండగా.. రాయపర్తి మండలం 44 శాతంతో చివరి స్థానంలో ఉంది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వానాకాలం–2026 సీజన్‌కు సంబంధించి ఎంపిక చేసిన సర్వే నంబర్లతో రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలను వలటీర్లు, సర్వేయర్లు, ఎన్యుమరేటర్ల ద్వారా జియో ట్యాగింగ్‌తో కూడిన మొబైల్ యాప్‌లో సేకరిస్తున్నారు. పంట విస్తీర్ణం, రకం, నీటి వసతి తదితర వివరాలతో పాటు సర్వేనంబర్లు, అక్షాంశాలు, రేఖాంశాలు, పంట ఫొటోలను ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు.
తక్షణమే రైతులకు ఫోన్ మెసేజ్..
గతంలో డిజిటల్ క్రాప్ బుకింగ్ సర్వే సమయంలో కొన్ని చోట్ల వలంటీర్లు పొరపాటున వేరే పంటల పేర్లు నమోదు చేయడంతో సమస్యలు ఎదురయ్యేవి. దీంతో పంట విక్రయ సమయాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ ప్రభుత్వం ఈ ఏడాది సరికొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. వలంటీర్ ఆన్లైన్లో పంట వివరాలు నమోదు చేయగానే.. క్షణాల వ్యవధిలో సంబంధిత రైతు మొబైల్ ఫోన్‌కు మెసేజ్ వచ్చేలా సాఫ్ట్‌వేర్‌లో కొత్త అలర్ట్ విధానాన్ని కూడా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల తన భూమిలో ఏ పంట నమోదైందనే అంశంపై రైతులకు తక్షణమే స్పష్టత వస్తుంది.
తప్పులుంటే 72 గంటల్లో సవరణ
వలంటీర్లు నమోదు చేసిన వివరాలు నేరుగా వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) లాగిన్‌కు వెళ్తాయి. ఒకవేళ తన మొబైల్‌కు వచ్చిన మెసేజ్‌లో పంట వివరాలు తప్పుగా ఉన్నట్లుగా రైతులు గుర్తిస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మెసేజ్ అందిన నాటి నుంచి 72 గంటల లోపు సంబంధిత ఏఈఓను సంప్రదించి సవరణ కోరే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. రైతు ఫిర్యాదు మేరకు ఏఈఓ పరిశీలించి సరిచేయడానికి ఆదేశిస్తే.. వలంటీర్ మరోసారి క్షేత్రస్థాయికి వచ్చి పంటను పరిశీలించి ఆన్లైన్లో సరిచేస్తారు.
రైతుల ప్రయోజనం కోసమే..
రైతుల ప్రయోజనం కోసం, పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం సర్వే చేపడుతోంది. గతంలో సర్వే చేసినప్పుడు దొర్లిన చిన్నపాటి పొరపాట్లతో పంట విక్రయాలు, ప్రభుత్వ సాయం అందే సమయంలో రైతులు ఇబ్బందులు పడ్డారు. ఏ పంటను ఎంత విస్తీర్ణంలో సాగు చేశారు, కచ్చితమైన అంచనాతో మద్దతు ధర కల్పించడానికి, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడానికి ఈ డిజిటల్ సర్వే అత్యంత కీలకం. పత్తి, వరి, మొక్కజొన్న తదితర పంటల విక్రయాలు సాఫీగా సాగాలంటే డీసీఎస్‌లో వివరాలు పక్కాగా ఉండాలి. వలంటీర్లు గ్రామాలకు వచ్చినప్పుడు రైతులు అందుబాటులో ఉండి సరైన వివరాలు నమోదు చేయించుకోవాలి. ఫోన్‌కు వచ్చే మెసేజ్‌లను పరిశీలించి ఏమైనా పొరపాట్లు ఉంటే నిర్ణీత 72 గంటల్లోగా ఏఈఓలను కలిసి పొరపాట్లను సరి చేసుకోవాలి.
– విజయభాస్కర్, జిల్లా వ్యవసాయ అధికారి
జిల్లాలో ముమ్మరంగా డిజిటల్ క్రాప్ సర్వే
94 శాతంతో నెక్కొండ మొదటి స్థానం,
44 శాతంతో రాయపర్తి చివరి స్థానం
చివరి దశకు చేరిన పంటల నమోదు
72 గంటల్లో తప్పుల సవరణకు అవకాశం కల్పించిన ప్రభుత్వం
మండలాల వారీగా డిజిటల్ క్రాప్ సర్వే వివరాలు
మండలం మొత్తం ప్లాట్లు సర్వే పూర్తి
నెక్కొండ 34,041 32,010
వరంగల్ 4,320 4,029
నల్లబెల్లి 27,148 24,942
నర్సంపేట 27,364 24,357
దుగ్గొండి 36,430 31,810
ఖిలా వరంగల్ 13,505 11,111
ఖానాపురం 15,337 12,182
పర్వతగిరి 34,894 25,458
చెన్నారావుపేట 23,814 16,167
సంగెం 38,848 20,518
వర్ధన్నపేట 39,307 19,923
గీసుకొండ 31,327 14,046
రాయపర్తి 47,721 20,894


