సాక్షి, వరంగల్: సర్ ప్రక్రియలో భాగంగా జిల్లాలో ఓటర్ల నుంచి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవడంతో పాటు ఇప్పటికే ఉన్న ఓటరు జాబితాలో పేర్లు, చిరునామాలు, ఇతర వివరాల సవరణలు, పేర్ల తొలగింపునకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. జూన్ 15 నుంచి అక్టోబర్ 7 వరకు జిల్లాలోని నర్సంపేట, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట నియోజకవర్గాల పరిధిలో ఫారం–6, 6ఏ, 7, 8 కలిపి 21,558 దరఖాస్తులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా ఫారం–8 కింద 11,963 దరఖాస్తులు రావడం గమనార్హం. అంటే కొత్తగా ఓటర్లను చేర్చడం కంటే ఇప్పటికే ఉన్న ఓటర్ల వివరాల్లో మార్పులు, సవరణలు, చిరునామా మార్పులు తదితర అవసరాలు ఎక్కువగా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు కొత్త ఓటర్ల నమోదుకు ఫారం–6 కింద 9,221 దరఖాస్తులు వచ్చాయి.
వరంగల్ తూర్పులోనే భారీగా..
వరంగల్ తూర్పులోనే అత్యధిక దరఖాస్తులు నమోదయ్యాయి. ఇక్కడ ఫారం–6 కింద 5,001, ఫారం–6ఏ కింద 50, ఫారం–7 కింద 182, ఫారం–8 కింద 7,126 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 12,359 దరఖాస్తులతో తూర్పు నియోజకవర్గం ముందంజలో ఉంది. వర్ధన్నపేటలో మొత్తం 6,353 దరఖాస్తులు, నర్సంపేటలో 2,846 దరఖాస్తులు నమోదయ్యాయి. ముఖ్యంగా ఫారం–8లో తూర్పు నియోజకవర్గంలో వచ్చిన 7,126 దరఖాస్తులు.. నర్సంపేట, వర్ధన్నపేట రెండింటిలో వచ్చిన దరఖాస్తుల మొత్తానికి కూడా మించి రావడం గమనార్హం.
ఏ దరఖాస్తులు ఎన్నంటే..
● కొత్తగా ఓటరుగా నమోదయ్యేందుకు ఉపయోగించే ఫారం–6 కింద జిల్లాలో 9,221 దరఖాస్తులు వచ్చాయి. నియోజకవర్గాల వారీగా చూస్తే తూర్పులో 5,001, వర్ధన్నపేటలో 2,929, నర్సంపేటలో 1,291 ఉన్నాయి. దరఖాస్తులు వచ్చిన సంఖ్యకు, ఇప్పటివరకు నమోదైనట్లు చూపిన ‘ఎన్రోల్ అప్డేటెడ్’ సంఖ్యకు భారీ వ్యత్యాసం ఉంది. జిల్లా మొత్తంలో ఫారం–6 కింద వచ్చిన 9,221 దరఖాస్తుల్లో 190 మాత్రమే ఎన్రోల్ అప్డేటెడ్గా నమోదయ్యాయి. మిగిలిన దరఖాస్తులు పరిశీలన/ప్రాసెసింగ్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది.
● విదేశాల్లో నివసిస్తున్న భారతీయ పౌరుల ఓటరు నమోదుకు సంబంధించిన ఫారం–6ఏ కింద 55 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో వరంగల్ తూర్పులో 50, నర్సంపేటలో 2, వర్ధన్నపేటలో 3 ఉన్నాయి. అయితే మూడు నియోజకవర్గాల్లోనూ ఫారం–6ఏ కింద ‘ఎన్రోల్ అప్డేటెడ్’గా ఒక్క దరఖాస్తు కూడా నమోదుకాలేదు.
●ఓటరు జాబితాలోని పేర్లపై అభ్యంతరం లేదా పేరును తొలగించేందుకు ఉపయోగించే ఫారం–7 కింద 319 దరఖాస్తులు నమోదయ్యాయి. ఇందులో తూర్పు 182, వర్ధన్నపేట 116, నర్సంపేట 21 ఉన్నాయి. వచ్చిన 319 దరఖాస్తుల్లో 238 దరఖాస్తులకు ‘ఎన్రోల్ డిలీటెడ్’గా నమోదైంది. అంటే మొత్తం ఫారం–7 దరఖాస్తుల్లో దాదాపు 74.6 శాతం మేరకు తొలగించారు. అభ్యంతరం, పరిశీలన, నోటీసులు, విచారణ వంటి ప్రక్రియ అనంతరం మాత్రమే తుది నిర్ణయం తీసుకుంటున్నారు.
● ఓటరు వివరాల సవరణలు, చిరునామా మార్పులు, ఓటరు కార్డు సంబంధిత మార్పులు తదితర అవసరాలకు ఉపయోగించే ఫారం–8 కింద 11,963 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 501 దరఖాస్తులు ‘ఎన్రోల్ అప్డేటెడ్’గా నమోదయ్యాయి. నియోజకవర్గాల వారీగా వరంగల్ తూర్పులో 7,126, వర్ధన్నపేటలో 3,305, నర్సంపేటలో 1,532 దరఖాస్తులు రాగా.. తూర్పులో 216, వర్ధన్నపేటలో 210, నర్సంపేటలో 75 ఎన్రోల్ అప్డేటెడ్ అయ్యాయి.
వివరాల సవరణకు 11,963 మంది
దరఖాస్తులు
కొత్త ఓటర్ల నమోదుకు 9,221..
పేర్ల తొలగింపునకు 319 అర్జీలు


