మునీందర్‌ ఇంటి నుంచే పాన్పు | - | Sakshi
Sakshi News home page

మునీందర్‌ ఇంటి నుంచే పాన్పు

Jan 25 2026 8:04 AM | Updated on Jan 25 2026 8:04 AM

మునీందర్‌ ఇంటి నుంచే పాన్పు

మునీందర్‌ ఇంటి నుంచే పాన్పు

ధూపం లేనిదే తల్లి గుట్టదిగదు..

ఆదివారం శ్రీ 25 శ్రీ జనవరి శ్రీ 2026
లక్షలాది మంది భక్తులు.. తల్లులను కీర్తిస్తూ జయజయధ్వానాలు.. డోలు వాయిద్యాలు.. కొమ్ము బూరల నాదాలు.. సుగంధ ధూపాల పరిమళాలు.. వీటన్నింటి నడుమ శక్తి స్వరూపాలను వనం నుంచి జనంలోకి తీసుకొచ్చే ఆ చేతులు మరెంతో శక్తివంతమైనవి.. ఎన్ని పదవులు అధిరోహించినా, ఎంత ధనమున్నా అంతటి అదృష్టం ఆ అడవి బిడ్డలకు మాత్రమే దక్కుతుంది. తల్లులను గద్దెకు చేర్చడంలో ఆదివాసీ పూజారుల పాత్ర కీలకం. నిష్టతో వనదేవతల సేవలో లీనమైన దాదాపు 25 మంది పూజారులపై ‘సాక్షి’ సండే స్పెషల్‌ స్టోరీ..
– ఏటూరునాగారం/ఎస్‌ఎస్‌ తాడ్వాయి

డవి తల్లులను వనంలోంచి జనంలోకి తీసుకువచ్చే పూజారులది ఎంతో అదృష్టం. సుమారు 25 మంది పూజారులు ఈ మహా ఘట్టంలో పాలుపంచుకుంటుండగా ప్రధానంగా సారలమ్మ పూజారులు ఆరుగురు, సమ్మక్క పూజారులు ఐదుగురు కీలక పాత్ర పోషిస్తారు. కన్నెపల్లి గుడిలోని సారలమ్మను పూజారి కాక సారయ్య ఈనెల 28న గద్దైపెకి తీసుకురానున్నారు. కాళ్లకు పారాణి ధరించి ఎర్రని వస్త్రాల ముసుగుతో అమ్మవారి రూపంలో వెదురుబుట్టలో అమ్మవారిని తీసుకుని కన్నెపల్లి నుంచి మేడారం గద్దెలకు బయల్దేరుతారు. అమ్మవారిని తీసుకొచ్చే ఉదయాన ప్రత్యేకంగా కుట్టించిన జాకెట్‌ని మాత్రమే సారయ్య ధరిస్తాడు. తండ్రి వారసత్వంగా ఈ బాధ్యతను సారయ్య గత 8 జాతరల ముందు నుంచి నిర్వర్తిస్తున్నాడు. కాకవంశ పూజారులు అమ్మవారి వెదురు బుట్ట సారయ్య చేతులోకి అందివ్వగానే ఆయనను అమ్మవారు ఆవహిస్తుంది. మిగతా పూజారులు ఆయనను పట్టుకొని గద్దెల వరకు తీసుకొస్తారు. గద్దైపె ప్రతిష్ఠించేంతవరకు ఆయన స్పృహలో ఉండరు.

సారలమ్మను తీసుకొస్తున్న కాక సారయ్య(ఫైల్‌)

సమ్మక్క ప్రధాన పూజారి సిద్ధబోయిన మునీందర్‌ ఇంటి నుంచి సమ్మక్క దేవతకు చేయాల్సిన పూజా క్రతువు, సామగ్రి అంతా ఈ ఇంటి నుంచి వెళ్తుంది. సమ్మక్కను తీసుకురావడానికి ముందుగా మునీందర్‌ ఇంటి వద్ద పసుపు, కుంకుమ, కంకణాలు, నైవేద్యం, ఊదు, అక్షింతలు, పసుపు బియ్యం, ఇతరత్రా పూజారులకు పూజా సామగ్రి (పాన్పు)ని తయారు చేసుకుని వెళ్తారు. మేడారం సమ్మక్క జాతరలో జరిగే ఏ పూజా కార్యక్రమం అయినా ఈ ఇంటి నుంచి వెళ్లడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ అని మునీందర్‌ చెబుతున్నాడు.

సమ్మక్కను తీసుకొస్తున్న పూజారులు (ఫైల్‌)

చిలకలగుట్ట నుంచి ధూపం లేనిదే అమ్మవారు గుట్ట దిగదు. అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం. ధూపం వడ్డె దొబె నాగేశ్వర్‌రావు ధూపదీప నైవేద్యం అమ్మవారికి సమర్పిస్తారు. గుట్ట పైనుంచి గద్దెకు చేరే వరకు అమ్మవారికి వడ్డె.. ధూపం వేస్తూనే ముందుకు సాగుతాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement