రౌడీ.. ముదిరితే వెలివేతే! | - | Sakshi
Sakshi News home page

రౌడీ.. ముదిరితే వెలివేతే!

Jan 25 2026 8:04 AM | Updated on Jan 25 2026 8:04 AM

రౌడీ.. ముదిరితే వెలివేతే!

రౌడీ.. ముదిరితే వెలివేతే!

రౌడీ.. ముదిరితే వెలివేతే!

సాక్షిప్రతినిధి, వరంగల్‌:

రంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో రౌడీషీటర్ల ఆగడాలను కట్టడి చేసేందుకు పోలీసుశాఖ మళ్లీ ‘బహిష్కరణ’ అస్త్రం ప్రయోగిస్తోంది. ఇటీవల కొందరు రౌడీషీటర్ల ఆగడాలు హద్దు మీరాయి. రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులతో చెట్టాపట్టాల్‌ వేసుకుని భూదందాలు, సెటిల్‌మెంట్లు, బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కొందరు ప్రజాప్రతినిధులు సైతం వీరికి అండదందడగా నిలిచి ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. వరంగల్‌ మహానగరంలో పోలీసు కమిషనరేట్‌, బల్దియా, కలెక్టరేట్లలో నిర్వహించిన ప్రజావాణికి అందిన ఫిర్యాదుల్లో భూదందాలు, సెటిల్‌మెంట్ల వివాదాలే ఎక్కువ. అందులో రౌడీషీటర్ల ప్రమేయం కూడా ఉంటుందన్న ఫిర్యాదులున్నాయి. పోలీస్‌ స్టేషన్లకు కూడా అందిన ఫిర్యాదులపై కేసులు నమోదయ్యాయి. దీంతో ముదురుతున్న నేరగాళ్లను అదుపు చేసేందుకు పోలీసులు హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ చట్టం 1,348, వరంగల్‌ మెట్రో పాలిటన్‌ పోలీసు చట్టం 2015లోని సెక్షన్‌ 28(1) ప్రకారం నగర బహిష్కరణ అస్త్రం ప్రయోగిస్తున్నారు.

కౌన్సెలింగ్‌తో మారని వారిపై పీడీయాక్ట్‌

గతంలో ప్రివెంటివ్‌ డిటెన్షన్‌ చట్టం (పీడీ యాక్టు) ఒక్కటే పరిష్కారంగా భావించిన పోలీసులు ఒక్క 2021 సంవత్సరంలోనే వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 141 మందిపై ఈ చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఇదే సమయంలో సత్ప్రవర్తనతో నడుచుకుని మారిన సుమారు 60 మందిపైన రౌడీషీట్‌ కూడా ఎత్తి వేశారు. ఇందులో రౌడీషీటర్లు, గంజాయి, పీడీఎస్‌ బియ్యం రవాణా చేసేవారు, భూకబ్జాదారులు, హత్యకేసుల్లో నిందితులుగా ఉన్న వారు కూడా ఉన్నారు. కరుడుగట్టిన నేరగాళ్ల ఆటకట్టించడంతోపాటు నేరాలను అదుపు చేసేందుకు పీడీ యాక్టుకు మరింత పదును పెట్టాలని పోలీసు ఉన్నతాధికారులు ఆ తర్వాత కూడా కేసులను కొనసాగించారు. అయితే ఆ తర్వాత ఎన్నికలప్పుడే బైండోవర్‌ చేసి వదిలేయడం వరకే చేయడంతో కొంతకాలం ఈ ప్రక్రియలో స్తబ్ధత నెలకొంది. ఇటీవల మళ్లీ ఫిర్యాదులు పెరుగుతుండడంతో వరంగల్‌, హనుమకొండ, కాజీపేటలో భూదందాలు, సెటిల్‌మెంట్లు, బెదిరింపుల ఘటనలపై పోలీసు ఉన్నతాధికారులు దృష్టిసారించారు. ఒకటికి రెండుసార్లు మందలించినా మారని వారిని గుర్తించి పీడీ యాక్టును ప్రయోగించడంతోపాటు ఆరు నెలల నగర బహిష్కరణ విధించేందుకు సిద్ధమయ్యారు.

ఏటేటా పెరుగుతున్న రౌడీషీటర్లు..

మూడేళ్ల క్రితం వరంగల్‌, హనుమకొండ, జనగామ జిల్లాల్లోని పోలీస్‌స్టేషన్ల వారీగా రౌడీషీట్‌ నమోదై ఉన్న 783 మందిలో 133 మంది సత్ప్రవర్తనతో ఉన్నారని గుర్తించి రౌడీషీట్‌ ఎత్తివేశారు. అప్పుడున్న డీసీపీ రఘునాథ్‌ గైక్వాడ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించి ఈ కార్యక్రమం నిర్వహించగా.. నేరాలకు పాల్పడిన వారిపైన కొత్తగా రౌడీషీట్లు తెరిచారు. అయితే కౌన్సెలింగ్‌ నిర్వహించి ఎత్తివేసినా.. ఏటా రౌడీషీటర్లు పెరుగుతున్నారు. 2024 డిసెంబర్‌ వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిఽధిలో రౌడీషీటర్ల సంఖ్య 719 ఉండేది. 2025 డిసెంబర్‌ 27 నాటికి 45 మంది పెరిగారు. ప్రస్తుతం రౌడీషీటర్ల సంఖ్య కమిషరేట్‌ పరిధిలో 764కు చేరింది. ఈ నేపథ్యంలో పద్ధతి మార్చుకోని రౌడీషీటర్లను నగర బహిష్కరణ ద్వారా కట్టడి చేయాలని పోలీసుశాఖ భావిస్తోంది. ఈ క్రమంలోనే మిల్స్‌కాలనీ పోలీసుస్టేషన్‌ పరిధిలోని వంచనగిరి సురేశ్‌ అలియాస్‌ కోతి సురేశ్‌పై ఆరు నెలల నగర బహిష్కరణ విధిస్తూ పోలీసు కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలోనూ పలువురు రౌడీషీటర్లపైన ఇదే అస్త్రం ప్రయోగించారు.

రౌడీషీటర్ల సెటిల్‌మెంట్లు,

భూదందాలపై పోలీసుల దృష్టి

పద్ధతి మార్చుకోకపోతే పీడీ యాక్టు

తప్పదని హెచ్చరిక

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో

764 మంది రౌడీషీటర్లు

మిల్స్‌కాలనీ పీఎస్‌ పరిధిలో

కోతి సురేశ్‌ నగర బహిష్కరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement