ఆడపిల్లలు ఆత్మవిశ్వాసంతో ఎదగాలి
వేలేరు: ఆడపిల్లలు ఆత్మవిశ్వాసంతో చదివి జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకోవాలని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సూచించారు. గొల్లకిష్టంపల్లి గ్రామంలోని కేజీబీవీలో రూ.1.28 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు కలెక్టర్ స్నేహశబరీష్‌తో కలిసి శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఆడపిల్లలు మగపిల్లల కంటే తక్కువేమీ కాదని.. ఏ రంగంలో చూసినా ఆడపిల్లలు అగ్రస్థానంలో ఉన్నారని అన్నారు. నియోజకవర్గంలోని 7 కేజీబీవీలకు రూ.9 కోట్ల 20 లక్షల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. గొల్లకిష్టంపల్లి కేజీబీవీలో రూ.3 కోట్ల 25 లక్షలతో అకడమిక్ బ్లాక్, రూ.1.60 కోట్లతో అదనపు తరగతి గదులు, ప్రహరీ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. అలాగే, పాఠశాలలో 25కేవీ ట్రాన్స్‌ఫార్మర్, బోరు ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌ను పూర్తిగా బాలికలకే కేటాయించినట్లు తెలిపారు. కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాలికల విద్యకోసం అనేక సదుపాయాలు కల్పిస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థినుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. అనంతరం విద్యార్థినులతో కలిసి ఎమ్మెల్యే కడియం, కలెక్టర్ మధ్యాహ్న భోజనం చేశారు. డీఈఓ ఎల్వీ గిరిరాజ్, తహసీల్దార్ కోమి, ఎంపీడీఓ లక్ష్మీప్రసన్న, జీసీడీఓ సునీత, సర్పంచ్‌లు యాదగిరి, శ్రీనివాస్, అశోక్, రాజు, సాంబయ్య, మనోజ్, వివిధ శాఖల అధికారులు, ఎస్‌ఓ స్రవంతి, నాయకులు మల్లికార్జున్, సద్దాంహుస్సేన్ పాల్గొన్నారు.
స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే
కడియం శ్రీహరి
గొల్లకిష్టంపల్లి కేజీబీవీలో
అభివృద్ధి పనులకు శంకుస్థాపన


