ఒకే జిల్లాగా చేయాలి
టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్
హన్మకొండ అర్బన్: హనుమకొండ, వరంగల్ జిల్లాలను ఒకే జిల్లాగా చేయాలని టీఎన్జీఓస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, జిల్లా ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ ఆకుల రాజేందర్ డిమాండ్ చేశారు. హనుమకొండ కలెక్టరేట్‌లోని టీఎన్జీఓస్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో జిల్లాల విభజన అశాసీ్త్రయంగా జరిగిందని, ఉమ్మడి వరంగల్ జిల్లాను ఆరు జిల్లాలు చేయడం వల్ల ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాను ఆరు జిల్లాలు చేయడం వల్ల ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, స్థానికత కోల్పోయి, కుటుంబాలకు దూరంగా, ప్రమోషన్లలో సీనియార్టీ కోల్పోయి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. జిల్లాల విభజన ఆధారంగా చేసిన జోనల్ విధానం వల్ల ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఉమ్మడి జిల్లా ఉద్యోగులు వివిధ జిల్లాలకు మరియు జోన్లకు కేటాయించడం వల్ల వారి సర్వీస్‌లో పరిష్కారం కాని అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని వివరించారు. హనుమకొండ, వరంగల్ జిల్లాలు భౌతికంగా కలిసే ఉన్నాయని ఈ రెండు జిల్లాలను కలపడం వల్ల ప్రజలకు, ఉద్యోగులకు మేలు జరుగుతుందన్నారు. హనుమకొండ, వరంగల్ జిల్లాలను కలపడాన్ని టీఎన్జీఓస్ యూనియన్ స్వాగతిస్తొందని పేర్కొన్నారు.


