జన సమూహాల్లో వీధి కుక్కలు తిరగొద్దు
వరంగల్ అర్బన్: మహా నగరం వ్యాప్తంగా జన సమూహాల్లో వీధి కుక్కలు తిరగకుండా చూడాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మేయర్, కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, అధికారులతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. జన సమూహాల్లో సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా కార్యాచరణ (యాక్షన్ ప్లాన్) సిద్ధం చేయాలన్నారు. నగరంలో జన సమూహ ప్రాంతాలైన పాఠశాలలు, రైల్వే, బస్ స్టేషన్లు, ఆస్పత్రులు పార్కులు, ఆలయాలు తదితర ప్రాంతాల్లో వీధి కుక్కలు సంచరించకుండా తగు చర్యలు చేపట్టాలన్నారు. అందుకు అనుగుణంగా ఆనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఏడబ్ల్యూబీఐ) వారి సూచనల్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. బల్దియా వ్యాప్తంగా 66 డివిజన్లలో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయడానికి ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్ శానిటేషన్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్, ఎస్‌ఈ సత్యనారాయణ, సీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి, సీహెచ్‌ఓ రమేశ్, ఇన్‌చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణి, ఎంహెచ్‌ఓ రాజేశ్ పాల్గొన్నారు.
సుప్రీంకోర్టు మార్గదర్శకాల్ని
అమలు చేయండి
యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి:
మేయర్ గుండు సుధారాణి


