మూడేళ్లయినా.. బ్రిడ్జి నిర్మించరా?
● ఐటీడీఏ అధికారులపై
ఎమ్మెల్యే రేవూరి ఆగ్రహం
సంగెం: నిధులు మంజూరై పనులు ప్రారంభించి మూడేళ్లు అవుతున్నా.. రోడ్డు, బ్రిడ్జి నిర్మాణం చేయకపోతే ఎలా? అంటూ ఐటీడీఏ ఈఈ వీరభద్రం, ఏఈ శ్రీనివాస్‌లపై ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మండలంలోని బీకోజీనాయక్ తండాను సందర్శించి అక్కడి నుంచి బాలునాయక్ తండాకు వెళ్లే రోడ్డుపై బ్రిడ్జి నిర్మించే ప్రదేశాన్ని క్షేత్రస్థాయిలో కాలినడకన పరిశీలించారు. ఈ సందర్భంగా 20 డిసెంబర్ 2022లో రూ 2.68 కోట్ల ఐటీడీఏ నిధులతో శంకుస్థాపన చేసిన్పటికీ ఇప్పటికీ.. పనులు ఎందుకు ప్రారంభించలేదని కాంట్రాక్టర్ రాజారావు, ఈఈ, ఏఈలపై అసహనం వ్యక్తం చేశారు. మొదలు పెట్టిన రోడ్డు పనుల్లో రేగడి, చౌడు పొలాల్లోని మట్టినే అటూ..ఇటూ తీసిపోయడాన్ని ఆయన తప్పుపట్టారు. వెంటనే పోసిన రేగడి, చౌడు మట్టిని తొలగించి మోరం పోసి నాణ్యత ప్రమాణాలతో రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. నిర్మాణ పనులు ఇంత ఆలస్యం అవుతున్నా పట్టింపు లేదని ఐటీడీఏ అధికారుల తీరు బాగాలేదని వారిపై చర్యకు ఈఎన్‌సీకి ఫిర్యాదు చేస్తామన్నారు. ఇటీవల కురిసిన వర్షాలు, తుపాను ప్రభావంతో కాపులకనిపర్తి వద్ద కొట్టుకుపోయిన రోడ్డు, తీగరాజుపల్లి వరకు గుంతలు పడిన రోడ్డు వెంటనే మరమ్మతు చేపట్టాలని ఆర్‌అండ్‌బీ డీఈ దేవికను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజ్‌కుమార్, ఎంపీడీఓ రవీందర్, ఐటీడీఏ ఈఈ వీరభద్రం, ఏఈ శ్రీనివాస్, పీఆర్ ఏఈ అభిరామ్, నాయకులు మాదవరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రమేశ్, వంశీ, నర్సింహనాయక్ తదితరులు పాల్గొన్నారు.


