పంట నష్టం వివరాలు నమోదు చేయండి
ధర్మసాగర్: పంట నష్టం వివరాలు త్వరగా నమోదు చేయాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. దేవునూరు, ముప్పారంలో కలెక్టర్ మంగళవారం పర్యటించి దెబ్బతిన్న పంటలు, రోడ్లు, వంతెనను పరిశీలించారు. పంట నష్టం వివరాలను అధికారులు, రైతులను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ శాఖ రూపొందించిన యాప్‌లో దెబ్బతిన్న పంటల వివరాలను నమోదు చేస్తున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రవీందర్ సింగ్ కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారీ వర్షాలతో దెబ్బతిన్న పంటలు, సర్వే నంబర్లు, రైతుల వారీగా వివరాలు నమోదు చేయాలని సూచించారు. వ్యవసాయశాఖ అధికారులు పంట నష్టం అంచనా వివరాలను త్వరగా అందజేయాలన్నారు. ముప్పారంలో వరద తాకిడికి సుమారు 450 క్వింటాళ్ల ధాన్యం కొట్టుకుపోయిందని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. వర్షాలతో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతు పనులు వెంటనే ప్రారంభించాలని, అందుకు సంబంధించిన అంచనాల నివేదికను అందజేయాలని పంచాయతీ రాజ్ శాఖ, ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా ధర్మసాగర్ రిజర్వాయర్‌ను కలెక్టర్ పరిశీలించారు. రిజర్వాయర్‌కు ఎంత ఇన్‌ఫ్లో వస్తోంది, రిజర్వాయర్ కెపాసిటీ, అవుట్ ఫ్లో గురించి నీటిపారుదల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత నెల 29న రిజర్వాయర్‌లో ఉన్న నీటి సామర్థ్యం తదితర వివరాలను కలెక్టర్‌కు అధికారులు వివరించారు. పంచాయతీ రాజ్ ఈఈ ఆత్మారాం, డీఈ శ్రీనివాసరావు, ఇరిగేషన్ ఈఈ మంగీలాల్, తహసీల్దార్ సదానందం, ఎంపీడీఓ అనిల్ కుమార్, ఏఓ రాజేశ్, అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ స్నేహ శబరీష్
దేవునూరు, ముప్పారంలో పర్యటన


