ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర
● జెడ్పీసీఈఓ రాంరెడ్డి
వర్ధన్నపేట: ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందని జెడ్పీ సీఈఓ రాంరెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని ఇల్లంద గ్రామంలోని వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం డ్రైయర్ యంత్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర అందించడంతో పాటు వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు సౌకర్యాలు కల్పించి కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తున్నారన్నారు. రైతులు ధాన్యంలో చెత్తా చెదారం లేకుండా, నిర్ణీత తేమ శాతం ఉండేలా రైతులు చూసుకుని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలన్నారు. తేమ ఉన్న ధాన్యాన్ని ఽఆరబెట్టే యంత్రం వినియోగించుకుని తేమ శాతాన్ని తగ్గించుకుని విక్రయించుకోవచ్చన్నారు. ధాన్యం సేకరణ అయిన వెంటనే రైతులకు వారి ఖాతాల్లో డబ్బులు జమ చేసేలా నిర్వాహకులు చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, ఏపీఎం రమణాచారి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ, నాయకులు పోశాల వెంకన్న, బండి శ్రీనివాస్, ఉప్పునూతల దేవేందర్, నిర్వాహకులు, రైతులు పాల్గొన్నారు.


