సాక్షి, వరంగల్: జిల్లాలో కురిసిన అకాల వర్షంతో పత్తి రైతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆరుగాలం పంట పడించి అమ్ముకునేందుకు మార్కెట్‌కు తీసుకొస్తే ఇక్కడ కూడా సౌకర్యాల లేమితో పత్తి బస్తాలు తడిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం కురిసిన అకాల వర్షంతో ఏనుమాముల మార్కెట్‌లో ఆరబోసిన మొక్కజొన్నలు, అమ్మేందుకు తీసుకొచ్చిన పత్తి బస్తాలు తడిశాయి. సుమారు 30 మంది రైతులకు సంబంధించిన సరుకు అరగంటకుపైగా కురిసిన వానతో ఆగమాగమైంది. మక్కలు నీటిలో కొట్టుకుపోయిన పరిస్థితి కనిపించింది. ఇప్పటికే మోంథా తుపాను ప్రభావంతో ఆగమాగమైన పత్తిని ఆరబోసి అవసరాల కోసం అమ్ముకునేందుకు మార్కెట్‌కు తీసుకొస్తే మళ్లీ ఇక్కడా కూడా తడవడంతో అన్నదాతలు కన్నీరుమున్నీరయ్యారు. ఇక మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రంలో మొక్కజొన్నలు అమ్మేందుకు తీసుకొచ్చిన రైతులకు తేమ శాతం ఎక్కువగా ఉందని, ఆరబోసి ఎండితేనే కొంటామని నిర్వాహకులు చెప్పడంతో మార్కెట్‌లో ఆరబోసిన రైతులకు వాన రూపంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇలా వచ్చిన ప్రతీ రైతు రెండు, మూడు రోజులు నిరీక్షించి ధాన్యాన్ని అమ్ముకునేందుకు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది.
షెడ్లు కరువు..
ఆసియాలోనే రెండో అతి పెద్దదైన ఏనుమాముల మార్కెట్‌లో ఎక్కువ మొత్తంలో షెడ్లు లేకపోవడం కూడా ప్రకృతి ప్రకోపం సమయంలో అన్నదాతలకు కడగండ్లు మిగులుస్తున్నాయనే మాటలు వినిపిస్తున్నాయి. వీటికితోడు మూడేళ్ల నుంచి పాలకవర్గం లేకపోవడం, అదే సమయంలో ఇన్‌చార్జ్ కార్యదర్శితోనే పాలన సాగిస్తుండడంతో పూర్తిస్థాయిలో అధికారులు దృష్టి సారించక పోవడం కూడా రైతులకు సరైన సౌకర్యాలు అందడం లేదని రైతు సంఘాలు అంటున్నాయి. వర్షం కురిసే సమయంలో వచ్చే వరద నీరు సాఫీగా వెళ్లేందుకు డ్రెయినేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో చిన్నపాటి వర్షానికే మార్కెట్‌లో వరదనీరు నిలిచే పరిస్థితి ఉందని మండిపడుతున్నాయి. మార్కెట్‌లోకి వచ్చిన రైతుకు సరుకు షెడ్డుల కింద పెట్టుకోవాలని మార్కెట్ సిబ్బంది అవగాహన కల్పించడంలో విఫలమవడం కూడా మరో కారణంగా కనబడుతోంది. ఇప్పటికై నా మార్కెట్ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిథులు దృష్టి సారించి అన్నదాతలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఉండేలా చూడాలని కోరుతున్నాయి.
వానకు తడిసిందని ‘తరుగు’
మార్కెట్‌కు తెల్లవారుజామునే రైతులు పత్తిని తీసుకువచ్చి యార్డుల ముందు ఉంచుతారు. వ్యాపారులు వచ్చి పత్తిలో ఉన్న తేమను గుర్తించి ధరలు నిర్ణయించడంతో అమ్ముకుని రైతులు ఇంటి దారి పడతారు. మంగళవారం జెండా పాట నిర్వహించే సమయంలోనే సుమారు గంటకు పైగా ఎడతెరిపిలేకుండా వర్షం కురవడంతో ఆరుబయట పెట్టిన పత్తి బస్తాలు తడిసిపోయాయి. యార్డు పైన పడిన నీరు వచ్చేందుకు ఏర్పాటు చేసిన పైపు కిందనే బస్తాలు పెట్టడంతో కొన్ని పత్తి బస్తాలు పూర్తిగా తడిసిపోయాయి. వర్షం తగ్గాక వ్యాపారులు రావడంతో సుమారు మూడు గంటలు ఆలస్యంగా కాంటాలు ప్రారంభించారు. మంగళవారం 7,329 బస్తాలు మార్కెట్‌కు వచ్చాయి. వీటిలో యార్డుల్లో కాకుండా ఆరుబయట 2,350 బస్తాలు ఉండడంతో సుమారు 1,600 బస్తాలు వర్షానికి తడిశాయి. బస్తాలు తడవడంతో వ్యాపారులు ప్రతి క్వింటాకు కిలోన్నర చొప్పున తరుగుకింద మినహాయించుకున్నట్లు తెలిసింది. అయితే మార్కెట్‌కు వచ్చి తడిసిన పత్తి, మక్కలను జేడీఎం శ్రీనివాస్, డీఎంఓ సురేఖలు పరిశీలించారు.
జిల్లాలో వరుస వర్షంతో ఆగమాగం
ఏనుమాముల మార్కెట్‌లో తడిసిన
పత్తి బస్తాలు కొట్టుకుపోయిన మక్కలు
పాలకవర్గం, పూర్తిస్థాయి
కార్యదర్శి లేక తిప్పలు
పర్యవేక్షణ లేమితో సౌకర్యాలు నిల్
ఇబ్బందుల్లో అన్నదాతలు
మక్కలు కొట్టుకుపోయాయి..
కురుస్తున్న వర్షాలతో గ్రామంలో ఆరబోసే పరిస్థితి లేకపోవడంతో మార్కెట్‌కు 50 క్వింటాళ్ల మక్కలు తీసుకువచ్చ. ఇక్కడ ఆరబోసినా.. అకాల వర్షంతో మక్కలు కొట్టుకుపోయాయి. పట్టించుకునే వారే లేరు.
– మెరుగు బుచ్చయ్య, మరిపల్లి, దుగ్గొండి
సౌకర్యాలు కల్పించాలి
రెండు ఎకరాల్లో పత్తి పంట సాగు చేశా. అకాల వర్షాలతో దిగుబడి తగ్గింది. మంగళవారం కురిసిన వర్షంతో పత్తి బస్తాలు తడిశాయి. క్వింటాకు రూ.6,900 ధర పలికింది. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో మార్కెట్‌లో రైతుల సరుకులకు సరైన సౌకర్యాలు కల్పించాలి.
– గున్న లచ్చులు, నందిగామ, భూపాలపల్లి
పత్తి రైతు క‘న్నీరు’
పత్తి రైతు క‘న్నీరు’
పత్తి రైతు క‘న్నీరు’


