
‘స్థానిక’ంగా గెలిపించుకుంటా..
కమలాపూర్: ‘అసెంబ్లీ ఎన్నికల్లో కష్టపడి నన్ను గెలిపించిన కార్యకర్తలు, నాయకులను రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నేను గెలిపించుకుంటా’ అని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. కమలాపూర్‌లో సోమవారం బీఆర్‌ఎస్ మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తట్టెడు మట్టి కూడా పోయలేదని విమర్శించారు. ఇంటింటికీ కాంగ్రెస్ బాకీ కార్డులు పంపిణీ చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రజల విశ్వాసం గెలుచుకున్నోళ్లకే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు కేటాయిస్తామన్నారు. కమలాపూర్ మండలంతో పాటు హుజూరాబాద్ నియోజకవర్గంలో అత్యధిక స్థానాలు గెలిపించి కేసీఆర్‌కు కానుకగా ఇస్తామన్నారు. సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్ సంపత్‌రావు, వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, డైరెక్టర్ సత్యనారాయణరావు, కేడీసీసీబీ డైరెక్టర్ కృష్ణప్రసాద్, మాజీ ప్రజాప్రతినిధులు లక్ష్మణ్‌రావు, నవీన్‌కుమార్, సమన్వయ కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పార్టీ మారితే తస్మాత్ జాగ్రత్త
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీపై గెలిచి పార్టీ మారితే తస్మాత్ జాగ్రత్త అని, ఎవరైనా పార్టీ మారితే వెయ్యి మందితో వారి ఇంటిపై దాడి చేస్తామని హెచ్చరించారు. ఉప్పల్ ఆర్‌ఓబీ నిర్మాణంలో కేంద్రం ఫెయిల్ అయ్యిందని విమర్శించారు. ప్రస్తుతం అక్కడ రోడ్డంతా గుంతలమయమై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వానికి చేతకాకపోతే ఎమ్మెల్యేల నిధులైనా విడుదల చేస్తే రోడ్డును బాగు చేయించుకుంటామన్నారు.
హుజూరాబాద్‌లో
గులాబీ జెండా ఎగురవేద్దాం
కార్యకర్తల సమావేశంలో
ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి