
ఇప్పటికిక ఇంతే...!
జీఓ 9పై హైకోర్టు స్టే.. ‘స్థానిక’ ఎన్నికలకు బ్రేక్
సాక్షిప్రతినిధి, వరంగల్ : స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ విడుదల చేసిన జీఓ 9పై దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు గురువారం స్టే ఇచ్చింది. ఉదయం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి నామినేషన్ల స్వీకరణ చేపట్టిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. హైకోర్టు తీర్పు తర్వాత ఆ మేరకే వ్యవహరిస్తామని ప్రకటించింది. దీంతో ఆరు వారాలపాటు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నిలిచిపోనుండగా.. డిసెంబర్ మొదటి వారం తర్వాత ఈ మధ్యకాలంలో జరిగే పరిణామాలను బట్టి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సెప్టెంబర్ 29న ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ మేరకు నవంబర్ మాసాంతానికి ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాల్లో ‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని అందరూ భావించారు. కానీ, హైకోర్టు స్టేతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
అంతటా కలకలం...
రాజకీయ పార్టీల్లో దుమారం..
రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్‌లో భాగంగా ఉమ్మడి వరంగల్‌లో మూడు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీతో పాటు వామపక్ష పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు పోటీలో నిలిచేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. సెప్టెంబర్ 29న షెడ్యూల్ విడుదల తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహించిన కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ఆశావహుల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించాయి. రెండు విడతల్లో పరిషత్, మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలకు అనుగుణంగా అభ్యర్థులను ప్రకటించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. దసరా పండుగకు ముందే రిజర్వేషన్లు ప్రకటించడం.. ఎన్నికల షెడ్యూల్ వెల్లడి కావడంతో ఆశావహుల సందడి పల్లెల్లో జోరందుకుంది. ఎంపీటీసీ, సర్పంచ్ పదవులను ఆశించే వారు పండగ కావడంతో ఖర్చుకు సైతం వెనకాడలేదు. కాగా, ప్రధాన పార్టీలు గురువారం ఉదయం విడుదలైన నోటిఫికేషన్ తర్వాత దశల వారీగా 11వ తేదీ వరకు నామినేషన్లకు ప్లాన్ చేసుకున్నా.. హైకోర్టు తీర్పు తర్వాతే అభ్యర్థులను ప్రకటించేందుకు నిర్ణయించుకున్నారు. నోటిఫికేషన్ వెలువడిన రెండున్నర గంటల్లోనే హైకోర్టు ఎన్నికలకు బ్రేక్ వేసే విధంగా స్టే ఇవ్వడం కలకలం రేపింది. ఇప్పటివరకు వేసిన నామినేషన్లు కూడా చెల్లుబాటు కావని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
ఊరించి, ఉసూరుమనిపించి..
మొత్తంగా 12 నామినేషన్లు..
రిజర్వేషన్ల ప్రకటన, ఎన్నికల నోటిఫికేషన్లు ఆశావహులను ఊరించాయి. కొత్తగా ప్రకటించిన రిజర్వేషన్లలో అవకాశం వచ్చిన వారు మురిసిపోయారు. షెడ్యూల్ ప్రకారం తొలి విడతలో ఉమ్మడి వరంగల్‌లో 37 జెడ్పీటీసీలు, 393 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ మేరకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ తర్వాత గురువారం ఉదయం నుంచి నామినేషన్‌ల ప్రక్రియ మొదలైంది. ముహూర్తం ప్రకారం 11వ తేదీలోగా నామినేషన్లు వేసేందుకు ఆశావహులు ఏర్పాట్లు చేసుకున్నారు. అంతా సజావుగా జరిగితే రెండో విడతకు 13వ తేదీ నుంచి 15వరకు నామినేషన్లు వేసేందుకు కూడా సర్వసన్నద్ధమయ్యారు. ఇదిలా ఉంటే మొదటి విడతలో 37 జెడ్పీటీసీ, 393 ఎంపీటీసీ స్థానాలకు గాను జెడ్పీటీసీలకు మూడు, ఎంపీటీసీలకు 9 నామినేషన్లు దాఖలయ్యాయి. మహబూబాబాద్, హసన్‌పర్తి, సంగెం జెడ్పీటీసీలకు ఒక్కో నామినేషన్ రాగా, మహబూబాబాద్ జిల్లాలో ఎంపీటీసీలకు ఐదు, వరంగల్ జిల్లాలో రెండు (సంగెం, గీసుకొండ), జేఎస్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం బాగిర్తిపేటలో ఒకటి, హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలంలో ఒకటి చొప్పున దాఖలైనట్లు అధికారులు తెలిపారు.
డిసెంబర్ మొదటివారం తర్వాతే.. ఆశావహులు అప్పటివరకు ఆగాల్సిందే
నోటిఫికేషన్ విడుదలైన రెండున్నర
గంటలకు న్యాయస్థానం తీర్పు..
ఉమ్మడి వరంగల్‌లో జెడ్పీటీసీకి 3,
ఎంపీటీసీలకు 9 నామినేషన్లు