
నాటికలతో నైపుణ్యాల పెంపు
కాళోజీ సెంటర్: నాటికలు విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందిస్తాయని జిల్లా సైన్స్ అధికారి డాక్టర్ కట్ల శ్రీనివాస్ అన్నారు. దక్షిణ భారత సైన్స్ డ్రామా ఫెస్ట్‌వల్–2025లో భాగంగా జిల్లాస్థాయి సైన్స్ డ్రామా పోటీలు గురువారం మట్టెవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడుతూ నవంబర్‌లో బెంగళూరులో జరగనున్న దక్షిణ భారత సైన్స్ డ్రామా పోటీలు–2025 జరుగుతాయని తెలిపారు. జిల్లాస్థాయి పోటీల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుంచి 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు పాల్గొన్నారని వివరించారు. మట్టెవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన పరిశుభ్రతే పరమాత్ముడు నాటిక ప్రథమ స్థానంలో నిలిచిందని, ఈనెల 17వ తేదీన హైదరాబాద్‌లోని ఎన్‌సీఆర్‌టీలో జరగనున్న రాష్ట్రస్థాయి సైన్స్ డ్రామా పోటీలకు జిల్లా తరఫున ఎంపికై ందని తెలిపారు. ఖిలా వరంగల్ ఆరెల్లి బుచ్చయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన స్మార్ట్ వ్యవసాయం ద్వితీయ స్థానం, రాయపర్తి మండలం కొలనుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన అందరికీ పరిశుభ్రత నాటిక తృతీయస్థానం సాధించింది. న్యాయనిర్ణేతలుగా రహమాన్, మాణిక్య రేఖ, డాక్టర్ స్వప్న, సురేశ్‌బాబు వ్యవహరించారు. విజేతలకు జిల్లా సైన్స్ అధికారి డాక్టర్ కట్ల శ్రీనివాస్, వరంగల్ ఎంఈఓ వెంకటేశ్వర్లు ప్రశంసపత్రాలు అందజేశారు. పాఠశాల హెచ్‌ఎం అరుణ, జిల్లా సైన్స్ రిస్సోర్స్ పర్సన్స్ కృష్ణంరాజు, సంతోష్, పరమేశ్వర్ పాల్గొన్నారు.