
రీయింబర్స్‌మెంట్ కోసం తల్లిదండ్రుల రాస్తారోకో
హన్మకొండ/న్యూశాయంపేట: బెస్ట్ అవైలబుల్ సూళ్ల విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ చెల్లించాలని జిల్లా విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి చేరుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు బుధవారం హనుమకొండ కాళోజీ కూడలిలో రాస్తారోకో చేశారు. వీరికి విద్యార్థి సంఘాలు ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూతో పాటు ఎమ్మార్పీఎస్, బీజేపీ, సీపీఐ మద్దతుగా నిరసనలో పాల్గొన్నాయి. రాస్తారోకో, ధర్నాతో ప్రధాన రాహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు వాహనాలను దారిమళ్లించారు. సుబేదారి ఇన్‌స్పెక్టర్ రంజిత్ కుమార్, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వెంకన్న, తన బలగాలతో చేరుకుని రాస్తారోకో చేస్తున్న ఆందోళనకారులను విరమించాలని కోరగా కలెక్టర్ వచ్చి స్పష్టమైన హామీ ఇస్తేనే రాస్తారోకో విరమిస్తామని భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో పోలీసులు కలెక్టర్‌తో మాట్లాడిస్తామని కొందరు తల్లిదండ్రులను వరంగల్ కలెక్టరేట్‌కు తీసుకెళ్లారు. గేట్ దగ్గరకు చేరుకోగానే కలెక్టర్ ఇక్కడికి రావాలని డిమాండ్ చేయడంతో పోలీసులు కలెక్టర్ సత్యశారదతో ఫోన్‌లో మాట్లాడించారు. కలెక్టర్ సూచనతో పోలీసులు.. జిల్లా రెవెన్యూ అధికారి విజయలక్ష్మిని కలిసి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, మార్టిన్ లూథర్, తల్లిదండ్రులు చెన్నకేశవులు, శ్రీనివాస్, అశోక్, జీడి ప్రసాద్, అనిల్, యాదగిరి, విజేందర్, రవీందర్, నాగరాజు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ రావాలని డిమాండ్
జిల్లా రెవెన్యూ అధికారికి వినతిపత్రం
ఇప్పించిన పోలీసులు