రిటర్నింగ్‌ అధికారుల పాత్ర కీలకం | - | Sakshi
Sakshi News home page

రిటర్నింగ్‌ అధికారుల పాత్ర కీలకం

Oct 9 2025 2:36 AM | Updated on Oct 9 2025 3:41 PM

దుగ్గొండి: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా రిటర్నింగ్‌ అధికారుల పాత్ర కీలకమని జిల్లా ఉద్యానశాఖ అధికారి శ్రీనివాసరావు అన్నారు. మండల పరిషత్‌ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్‌, సహాయ రిటర్నింగ్‌ అధికారులు, సహాయకులకు బుధవారం శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. ఎంపీటీసీ, సర్పంచ్‌ అభ్యర్థుల నామినేషన్లు, నియమ నిబంధనలు, బాధ్యతలను వివరించారు. నామినేషన్‌ నుంచి పోలింగ్‌ నిర్వహణ, ఎన్నికల ఫలితాల వరకు రిటర్నింగ్‌ అధికారులే పూర్తి బాధ్యత వహించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ అరుంధతి, ఎంపీఓ మోడెం శ్రీధర్‌గౌడ్‌, ఎంఈఓ వెంకటేశ్వర్లు, ఎస్సై రావుల రణధీర్‌రెడ్డి, ఏఈలు సతీశ్‌, మంగ్యానాయక్‌, పంచాయతీ కార్యదర్శులు, రిటర్నింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

నర్సంపేట రూరల్‌: పారా మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు విద్యార్థులు ఈనెల 28లోగా దరఖాస్తు చేసుకోవాలని నర్సంపేట వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ మోహన్‌దాస్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కళాశాలలో ఈసీజీ 30 సీట్లు, డయాలసిస్‌ 30 సీట్లు ఉన్నాయని తెలిపారు. అభ్యర్థులు దరఖాస్తులతోపాటు అన్ని సర్టిఫికెట్ల జిరాక్స్‌లు జతచేయాలని సూచించారు. తప్పుడు సమాచారం, సంబంధిత సర్టిఫికెట్లు సమర్పించని వారి దరఖాస్తులు తిరస్కరిస్తామని పేర్కొన్నారు. నవంబర్‌ ఒకటిన అభ్యర్థులను ఎంపిక చేస్తామని, మరిన్ని వివరాల కోసం tgpmb.telangana.gov.in లో సంప్రదించాలని కోరారు.

వంద శాతం ఎఫ్‌ఆర్‌ఎస్‌

కాళోజీ సెంటర్‌: జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ముఖ గుర్తింపు (ఎఫ్‌ఆర్‌ఎస్‌) హాజరు నమోదు వందశాతం పూర్తి చేసినట్లు డీఐఈఓ డాక్టర్‌ శ్రీధర్‌ సుమన్‌ తెలిపారు. బుధవారం హాజరు రిజిస్ట్రేషన్‌ తీరుతెన్నులను కళాశాలల వారీగా సమీక్షించినట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,191 మంది ప్రథమ సంవత్సరం, 959 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు, 187 మంది సిబ్బందికి పూర్తిస్థాయిలో రిజిస్ట్రేషన్‌ పూర్తయినట్లు తెలిపారు. ముఖ గుర్తింపు హాజరు రిజిస్ట్రేషన్‌లో వరంగల్‌ జిల్లా ముందంజలో ఉందని, విద్యార్థుల హాజరు మెరుగుపరిచేందుకు దృష్టి సారించాలని కళాశాలల ప్రిన్సిపాళ్లను ఆదేశించినట్లు చెప్పారు.

కబడ్డీ క్రీడాకారులకు అభినందనలు

నర్సంపేట: నిజామాబాద్‌ జిల్లా ముప్‌కప్‌లో సెప్టెంబర్‌ 25 నుంచి 28వ తేదీ వరకు జరిగిన తెలంగాణ రాష్ట్రస్థాయి సబ్‌ జూనియర్‌ బాలబాలికల కబడ్డీ పోటీల్లో జిల్లా జట్టుకు ప్రాతినిథ్యం వహించిన నర్సంపేటకు చెందిన కబడ్డీ క్రీడాకారులు అజ్మీరా శ్రీజ, మూడు అశోక్‌కు జిల్లా యువజన, క్రీడల అధికారి టీవీఎల్‌ సత్యవాణి బుధవారం జ్ఞాపికలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా డీవైఎస్‌ఓ సత్యవాణి మాట్లాడుతూ నర్సంపేట స్టేడియంలో ఉన్న సౌకర్యాలను ఉపయోగించుకొని ఉత్తమ క్రీడాకారులుగా ఎదగాలన్నారు. భవిష్యత్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిథ్యం వహించే విధంగా పట్టుదలతో శిక్షణ పొందాలని సూచించారు. కార్యక్రమంలో స్టేడియం ఇన్‌చార్జ్‌, కబడ్డీ కోచ్‌ యాట రవికుమార్‌ ముదిరాజ్‌, డీవైఎస్‌ఓ కార్యాలయ స్టాఫ్‌, కోచ్‌లు పాల్గొన్నారు.

రైతులతో సమావేశం

నయీంనగర్‌: ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కోసం భూములు సేకరించేందుకు ఆరెపల్లి గ్రామానికి చెందిన రైతులతో బుధవారం ‘కుడా’ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఇందులో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌.నాగరాజు, ‘కుడా’ వీసీ చాహత్‌ బాజ్‌పాయ్‌, పీఓ అజిత్‌రెడ్డితో కలిసి ‘కుడా’ చైర్మన్‌ ఇనుగాల వెంకట్రాంరెడ్డి రైతులతో మాట్లాడారు. ‘కుడా’ చైర్మన్‌ రైతులకు ప్రొజెక్టర్‌ ద్వారా ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ వచ్చే ప్రదేశాలను చూపిస్తూ, వారికి జరిగే అభివృద్ధి గురించి, ల్యాండ్‌ పూలింగ్‌ అంశం మీద రైతుల్లో నెలకొన్న భయాలు పూర్తిగా తొలగిపోయేలా వివరించారు. భూములు సేకరించి అభివృద్ధి చేస్తామని తెలిపారు.

రిటర్నింగ్‌ అధికారుల పాత్ర కీలకం1
1/1

రిటర్నింగ్‌ అధికారుల పాత్ర కీలకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement