దుఃఖం | - | Sakshi
Sakshi News home page

దుఃఖం

Oct 6 2025 1:52 AM | Updated on Oct 6 2025 1:52 AM

దుఃఖం

దుఃఖం

దూది రైతుల

ఈ ఫొటోలో పత్తి కాయలు ఒలుస్తోన్న మహిళా రైతు నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన బత్తిని అరుణ. తనకున్న ఎకరం భూమిలో పత్తి పంట సాగు చేసింది. సుమారు రూ.40వేల వరకు పెట్టుబడి పెట్టింది. ఇటీవల కురుస్తున్న వర్షాలతో పంట నష్టపోయింది. పత్తి పంటలో వర్షం నీరు నిలవడంతో దిగుబడి తగ్గింది. ఉన్న ఒకటి, రెండు కాయలు తెంపుకొచ్చి ఇంటి దగ్గర ఒలుస్తోంది. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇలా జిల్లా వ్యాప్తంగా పత్తి రైతుల పరిస్థితి ఇలానే ఉంది.

అకాల వర్షాలతో దెబ్బతిన్న పత్తిపంట

నర్సంపేట: పత్తి రైతు ఏటా నష్టపోతూనే ఉన్నాడు. అకాల వర్షాలు, తెగుళ్లు, చీడపీడలతో దిగుబడి రాక, ఉన్న కొద్దిపాటి పత్తిని మద్దతు ధరకు అమ్ముకోలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో పెట్టిన పెట్టుబడులు పెరిగి, అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.8,110 ధర కూడా పెట్టడం లేదు. కొత్త నిబంధనలతో జిన్నింగ్‌ మిల్లులు టెండర్లకు ముందుకు రాకపోవడంతో సీసీఐ కొనుగోళ్లపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇదే అదనుగా దళారులు క్వింటాకు రూ.3 వేల నుంచి రూ.7వేల వరకు కొనుగోలు చేస్తూ రైతులను నిండా ముంచుతున్నారు.

అకాల వర్షాలు, తెగుళ్లు, ఎరువుల కొరత

ఈ ఏడాది మే మాసంలో కురిసిన అకాల వర్షాలతో రైతులు రోహిణి కార్తెలో పత్తి విత్తనాలు నాటారు. ఏపుగా పెరిగి కాయ దశలో తెగుళ్లు విజృంభించి పత్తి పంటను నాశనం చేశాయి. ఇదే క్రమంలో యూరియా దొరకకపోవడంతో పత్తి ఎదుగుదలలో లోపం స్పష్టంగా కనిపించింది. దీంతో దిగుబడి గణనీయంగా తగ్గింది. అయితే ఉన్న కాస్త పత్తి ఏరి ఇటీవల అమ్ముకుంటున్న రైతులకు మద్దతు ధర లభించడం లేదు. సీసీఐ కొనుగోలు లేకపోవడంతో దళారులు వారిని నిలువునా ముంచుతున్నారు.

కొత్త నిబంధనలతో...

సీసీఐ కొత్త నిబంధనలు కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. 2022లో క్వింటా పత్తి ధర రూ.14వేలు ఉండగా అంతర్జాతీయ ప్రమాణాలతో పత్తి ధరలు భారీగా పడిపోయాయి. దీంతో రైతులు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సీసీఐ ధరలపై ఆధారపడుతున్నారు. కాగా సీసీఐ ఉమ్మడి వరంగల్‌ జి ల్లాలో 58 జిన్నింగ్‌ మిల్లుల ద్వారా కొనుగోలు చేస్తుంది. సీసీఐ, జిన్నింగ్‌ మిల్లుల మధ్య ఏర్పడిన వివాదంతో కొనుగోలు జరగడం లేదు. మార్క్‌ఫెడ్‌ మినహా ప్రైవేట్‌ వ్యాపారులు దూరంగా ఉండడంతో సీసీఐ కొనుగోలు ప్రశ్నార్థకంగా మారాయి.

వర్షాలతో పత్తి అమ్మకాలు...

అకాల వర్షాలతో రైతులు పత్తిని ఇంట్లో నిల్వ చేసుకోవడం లేదు. ఏరిన పత్తిని ఏరినట్లు మార్కెట్‌కు తరలించి అమ్ముకుంటున్నారు. ఉన్న కొద్ది పాటి పత్తిని అమ్మితే మద్దతు లభించడం లేదని, కూలీల ఖర్చులు పెరిగాయని, దీంతో పెట్టిన పెట్టుబడులు మీద పడి అప్పుల పాలవుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా సీసీఐ కొనుగోళ్లు ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు.

మురిగిపోతున్న పత్తి కాయలు

సీసీఐ కొనుగోళ్లపై అనుమానాలు

కొత్త నిబంధనలతో టెండర్లకు దూరంగా జిన్నింగ్‌ మిల్లులు

దళారులకు వరంగా మారిన కొనుగోళ్లు

జిల్లాలో 1,26,500 ఎకరాల్లో పత్తి సాగు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement