
మక్క రైతులను ముంచుతున్న దళారులు
నర్సంపేట: రైతులు ఆరుగాలం కష్టించి పండించిన మొక్కజొన్నలను దళారులు, వ్యాపారులు మద్దతు ధర కంటే తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ దోచుకుంటున్నారని, ప్రభుత్వం తక్షణమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని అఖిల భారత రైతు సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎంసీపీఐ(యూ) ఏఐకేఎఫ్ ఆధ్వర్యంలో ఆదివారం నర్సంపేట వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించి మొక్కజొన్నలను అమ్మకానికి తీసుకువచ్చిన రైతుల ఇబ్బందులు, ధరల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పెద్దారపు రమేశ్ మాట్లాడుతూ రైతాంగం ఆరుగాలం కష్టించి అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి ప్రకృతి వైఫరీత్యాలను ఎదుర్కొని మొక్కజొన్నలను పండిస్తే ప్రభుత్వాలు సరైన మార్కెట్ సౌకర్యం కల్పించకుండా దళారులకు, వ్యాపారులకు వత్తాసు పలుకుతుందన్నారు. ఈ క్రమంలో కనీస మద్దతు ధర క్వింటా రూ.2,400 అమ్మాల్సిన మొక్కజొన్నలు రూ.1,600 నుంచి రూ.2,100 దాటడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రంలోనే మొదట దిగుబడి వచ్చే జిల్లాలో ఇంత వరకు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుందన్నారు. అధిక వర్షాలతో దిగుబడి తగ్గి దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతాంగానికి పండిన మొక్కజొన్నలకై నా కనీస మద్దతు ధర కల్పించాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు. మార్కెట్లో మొక్కజొన్నలు ఆరబోసుకుని వారాలు గడుస్తున్న కుంటి సాకులతో ధర తగ్గించడానికి కొనుగోలు జరగకపోవడం అన్యాయమన్నారు. ఇప్పటికై నా తక్షణమే రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కనీస మద్దతు ధర అమలు అయ్యే విధంగా మార్క్‌ఫెడ్‌లను రంగంలోకి దించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, మద్దతు ధర కంటే తక్కువ కొనుగోలు చేసే వ్యాపారులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు కన్నం వెంకన్న, డివిజన్ కార్యదర్శి మహమ్మద్ రాజాసాహెబ్, సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి, ఏఐకేఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు కేశెట్టి సదానందం, కలకోట్ల యాదగిరి, రాజేందర్, వీరన్న, సురేష్, రైతులు పాల్గొన్నారు.
ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేశ్