వ్యూహాలకు పదును | - | Sakshi
Sakshi News home page

వ్యూహాలకు పదును

Oct 5 2025 2:02 AM | Updated on Oct 5 2025 2:02 AM

వ్యూహాలకు పదును

వ్యూహాలకు పదును

వ్యూహాలకు పదును

సాక్షిప్రతినిధి, వరంగల్‌ :

సా్థనిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఉమ్మడి వరంగల్‌ పరిధిలోని ఆరు జిల్లా పరిషత్‌లతో పాటు ఎంపీపీలు, సర్పంచ్‌ స్థానాలను కై వసం చేసుకునేందుకు పావులు కదుపుతున్నాయి. గెలుపు గుర్రాలను రంగంలోకి దింపేందుకు అన్ని పార్టీలు కసరత్తు మొదలెట్టాయి. అధికార కాంగ్రెస్‌ పార్టీ ఈ విషయంలో ఓ అడుగు ముందుకు వేసి నియోజకవర్గస్థాయి సమావేశాల ద్వారా దరఖాస్తులు స్వీకరించేందుకు ఆదివారం నుంచి కార్యాచరణ అమలు చేయనుంది. బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ద్వితీయ శ్రేణి నేతలు, కేడర్‌తో సంప్రదింపులు చేస్తున్నారు. బీపేజీ కార్యకర్తలు స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని రాష్ట్ర కమిటీ సందేశం పంపింది. ఇక వామపక్షాలు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ, బీఎస్పీ తదితర పార్టీలు సైతం కార్యకలాపాలు చేస్తున్నాయి.

ఇన్‌చార్జ్‌ మంత్రి, ఎమ్మెల్యేలకు

కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపిక బాధ్యత..

జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి, ఎమ్మెల్యేలు జిల్లా కమిటీ అధ్యక్షులు, ముఖ్యనేతలను సమన్వయం చేసుకుని అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ఈ మేరకు ఆదివారం నుంచి నియోజకవర్గాల వారీగా కార్యకర్తల సమావేశం నిర్వహించి అభిప్రాయ సేకరణ చేయనున్నారు. ఇదే సమయంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌, వార్డు సభ్యుల పదవులకు పోటీపడే వారినుంచి దరఖాస్తులు కూడా స్వీకరించనున్నారు. ఒక్కో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్‌ స్థానంనుంచి నాలుగు నుంచి ఐదు పేర్లను పరిశీలించి అధిష్టానానికి ప్రతిపాదించనున్నారు. స్థానిక అభ్యర్థులకు ఈ విషయంలో ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ప్రజాదరణ, కార్యకర్తల మద్దతు ప్రాధాన్యాంశాలు కానున్నాయని, అభ్యర్థుల ఎంపిక అధిష్టానం సూచనల మేరకు పారదర్శకంగా ఉంటుందని ఓ ప్రజాప్రతినిధి తెలిపారు. నియోజకవర్గాల వారీగా నిర్వహించే సమావేశాలు కీలకమైనందున కార్యకర్తలు, నాయకులు హాజరయ్యేలా చూసుకోవాలని జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి శనివారం జిల్లా ఎమ్మెల్యేలకు సూచించినట్లు తెలిసింది. ఈ మేరకు ఎమ్మెల్యేలు ముందుగానే నాయకులు, కార్యకర్తలకు సమాచారం అందించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఆరు జెడ్పీలపై గురి...

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌... ఈ రెండు పార్టీలు ఆరు జిల్లా పరిషత్‌ స్థానాలపై గురిపెట్టాయి. బీజేపీ సైతం గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది. ఈసారి హనుమకొండ జెడ్పీ ఎస్సీ మహిళ, వరంగల్‌ ఎస్టీ జనరల్‌, ములుగు ఎస్టీ మహిళ, జనగామ ఎస్సీ మహిళ, మహబూబాబాద్‌ జనరల్‌, భూపాలపల్లి బీసీ జనరల్‌కు రిజర్వు చేశారు. వాస్తవానికి హనుమకొండ, వరంగల్‌, జనగామ జనరల్‌కు వస్తాయని ఆశావహులు భావించారు. అందుకు భిన్నంగా రిజర్వేషన్లు ఉండటంతో ఆశావహుల అంచనాలు దెబ్బతినగా.. ఈ ఆరింటిని ఎలా కైవసం చేసుకోవాలి? అన్న వ్యూహంలో ప్రధాన పార్టీల నాయకత్వం యోచిస్తోంది. 12 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 75 జెడ్పీటీసీ స్థానాలు.. 75 ఎంపీపీ పదవులను దక్కించుకోవడం కూడా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌కు ప్రతిష్టాత్మకంగా మారింది. 778 ఎంపీటీసీలు, 1,705 సర్పంచ్‌ స్థానాలకు రిజర్వేషన్ల ప్రకా రం అభ్యర్థులను ఎంపిక చేసి గెలిపించుకోవడం పెద్ద టాస్క్‌గా మారింది. కాగా, ఈ నెల 8న రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్‌పై విచారణ, తీర్పు ఉండగా.. ఆ మరుసటి రోజు 9వ తేదీ నుంచి మొదటి విడత ఎన్నికల జరిగే ప్రాంతాల్లో అభ్యర్థులు నామినేషన్లు వేసేలా పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. గెలుపు గుర్రాల ఎంపికలో ప్రధాన పార్టీలు పావులు కదుపుతుండగా.. పల్లెల్లో ‘స్థానిక’ ఎన్నికల సందడి రోజు రోజుకూ జోరందుకుంటోంది.

‘స్థానిక’ ఎన్నికలకు పావులు

కదుపుతున్న అగ్రనేతలు

ప్రధాన రాజకీయపార్టీల్లో

సాగుతున్న కసరత్తు

ఇన్‌చార్జ్‌ మంత్రులు, ఎమ్మెల్యేలపై

కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపిక బాధ్యత

నేటినుంచి నియోజకవర్గాల్లో

కార్యకర్తల సమావేశాలు

బీఆర్‌ఎస్‌, బీజేపీలోనూ

అభ్యర్థుల ఎంపికపై కసరత్తు

గెలుపు గుర్రాల వేటలో

మూడు ప్రధాన పార్టీలు..

ఆశావహుల నుంచి

దరఖాస్తుల స్వీకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement