
విధులకు హాజరు కాకపోతే చర్యలు
● ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
● వర్ధన్నపేట సీహెచ్‌సీ ఆకస్మిక తనిఖీ
వర్ధన్నపేట: వైద్యులు, సిబ్బంది విధులకు హాజరుకాక పోతే కఠిన చర్యలు ఉంటాయని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు స్పష్టం చేశారు. ఆదివారం పట్టణ కేంద్రంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోగులకు అందుతున్న వైద్యసేవలను పరిశీలించారు. ఆస్పత్రి అంతా కలియ తిరుగుతూ రోగులతో మాట్లాడారు. వైద్య సేవలు సరిగా అందుతున్నాయో లేదో వారిని అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. ఆస్పత్రిలో మౌలిక సదుపాయాలు అవసరముంటే లిఖిత పూర్వకంగా తనదృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. వైద్యులు, సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. డ్యూటీ ఉండాల్సిన వైద్యులు లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన జిల్లా ఆరోగ్య శాఖ అధికారులకు ఫోన్ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. వైద్య సేవలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతకు ముందు కోనారెడ్డి చెరువుకు నీటిని అందించే ఫీడర్ చానల్ పనులను పరిశీలించారు. ఎమ్మెల్యే వెంట స్థానిక ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.