
మంత్రి, ఎమ్మెల్యే మధ్య మాటల ఈటలు
రోజురోజుకూ పెరుగుతున్న ఆగాధం
రచ్చకెక్కుతున్న వరంగల్ కాంగ్రెస్ రాజకీయాలు
గతంలోనూ హైకమాండ్‌కు ఫిర్యాదుల పరంపర
చర్యల విషయంలో చేతులెత్తేసిన కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం
తాజాగా మళ్లీ వివాదాస్పదంగా మంత్రి, ఎమ్మెల్యేల వ్యాఖ్యలు ∙
ప్రజాపాలన ఉత్సవాలకు ముఖ్య అతిథుల మార్పు
సాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్‌లో కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు మళ్లీ రచ్చకెక్కుతున్నాయి. పార్టీ ప్రజాప్రతినిధుల మధ్య నెలకొన్న అంతర్గత విబేధాలు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతున్నాయి. తాజాగా రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి (వరంగల్ తూర్పు ఎమ్మెల్యే) కొండా సురేఖ, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. వరంగల్ నగరంలోని భద్రకాళి దేవస్థానం పాలకమండలి నియామకం సందర్భంగా ఏర్పడిన మనస్పర్థలు చినికి చినికి గాలి వానలా మారాయి. నాలుగైదు రోజులుగా ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటుండడం కాంగ్రెస్ పార్టీ కేడర్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. అధికార పార్టీకి చెందిన మంత్రి, ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో చేసుకుంటున్న వ్యాఖ్యలు మరోసారి జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
రచ్చకెక్కుతున్న కాంగ్రెస్ రాజకీయాలు
నాలుగు నెలల క్రితం మంత్రి కొండా సురేఖ దంపతులు, ఎమ్మెల్యేల మధ్య మొదలైన మాటల యుద్ధం ఘర్షణ వాతావరణానికి దారి తీసింది. ఈసందర్భంగా మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళీధర్‌రావు చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ నియోజకవర్గాల్లో జోక్యం చేసుకుంటున్నారంటూ ఆరోపించారు. ఈమేరకు ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ కొండా సురేఖ దంపతులపై సీఎం రేవంత్‌రెడ్డికి, టీపీసీసీకి ఫిర్యాదు చేశారు.
ప్రాథమికంగా ఇరువర్గాలతో మాట్లాడిన టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్.. పార్టీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు మల్లు రవికి అప్పగించారు. దీంతో ఆయన మంత్రి సురేఖ, కొండా మురళీధర్‌రావుతో పాటు ఎమ్మెల్యేలతో విడివిడిగా మాట్లాడారు. సుమారు మూడు పర్యాయాలు మంత్రి, ఎమ్మెల్యేల మధ్యన నెలకొన్న వివాదం పరిష్కారం కోసం టీపీసీసీ, క్రమశిక్షణ సంఘం వేర్వేరుగా ప్రయత్నించింది. అయినప్పటికీ ఆ గొడవ సద్దుమణగకపోగా... ఒక దశలో ‘‘వారా.. మేమా’’ తేల్చాలని ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. దీంతో ఈ అంశంపై క్రమశిక్షణ సంఘం కూడా ఎటూ తేల్చలేకపోగా, సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ జోక్యం చేసుకుని మంత్రి, ఎమ్మెల్యేలతో మాట్లాడారు. ఆ తర్వాత కొంత స్తబ్ధత నెలకొన్నా పరిస్థితి నివురుగప్పిన నిప్పులానే ఉంది.
అతిథుల మార్పు వెనుక?
సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవానికి హాజరయ్యే మంత్రులు/ప్రముఖుల పేర్లను ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. అయితే ఉమ్మడి వరంగల్‌కు సంబంధించిన కొన్ని జిల్లాలకు ఈసారి స్వల్పంగా మార్పులు చేసింది. గతంలో వరంగల్ కలెక్టరేట్‌లో రెవెన్యూశాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, హనుమకొండలో అటవీశాఖమంత్రి కొండా సురేఖ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకల్లో పాల్గొనేవారు.
ప్రజాపాలన వేడుకల సందర్భంగా కొండా సురేఖను వరంగల్‌కు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని హనుమకొండ జిల్లాలకు మార్చారు. ఈ మార్పు వెనుక ఇటీవల ఎమ్మెల్యేలు వర్సెస్ మంత్రి సురేఖ మధ్య ఉన్న వివాదాలు కారణం కాకపోలేదన్న చర్చ జరుగుతోంది. కాగా ఈసారి ములుగులో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, మహబూబాబాద్‌లో ప్రభుత్వ విప్ జె.రామచంద్రునాయక్, జనగామలో ప్రభుత్వ విప్ బీర్ల వీ రయ్య, జయశంకర్ భూపాలపల్లిలో తెలంగాణ ఎస్‌టీ కో–ఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్ వేడుకల్లో ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.
వ్యాఖ్యల కలకలం
సీఎం, టీపీసీసీల జోక్యం తర్వాత గొడవలు సద్దుమణిగినట్లుగానే కనిపించినా.. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మధ్య వ్యాఖ్యలు కలకలంరేపాయి. భద్రకాళి ఆలయ పాలకమండలి కమిటీ సందర్భంగా ‘ఏది చేసినా నడుస్తోందని మంత్రి కొండా సురేఖ అనుకుంటున్నారని’ మంత్రిపై ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ధ్వజమెత్తారు. ‘స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా భద్రకాళి ఆలయ పాలక మండలి సభ్యులను ఎలా నియమిస్తారు? అని ప్రశ్నించారు. దేవాదాయశాఖకు మంత్రి అయినంత మాత్రాన ఏదైనా చేయొచ్చా? నా నియోజకవర్గంలో మంత్రి పెత్తనం ఏంటి?’ అని నిలదీశారు.
అంతా మంత్రి చేస్తే స్థానికంగా తాను ఉన్నది దేనికని.. ఇదే పద్ధతి అవలంబిస్తే తాను చూస్తూ ఊరుకోనని కూడా హెచ్చరించారు. ఇదే సందర్భంలో ‘నాయిని రాజేందర్ రెడ్డి అదృష్టం కొద్ది ఎమ్మెల్యే అయ్యాడు. నాయిని వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్న. ఆయనపై నేను కామెంట్ చేయాలనుకోవడం లేదు. మంత్రి హోదాలో ఇద్దరు ధర్మకర్తలను కేటాయించుకునే స్వేచ్ఛ లేదా?’ అంటూ మంత్రి కొండా సురేఖ స్పందించారు. కేవలం తాము అధిష్ఠానం నుంచి వచ్చిన పేర్లను మాత్రమే భర్తీ చేశామని కూడా వివరించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన రాజేందర్ రెడ్డి.. ‘పూటకో పార్టీ మార్చిన ఘనత మంత్రి సురేఖది. 40 ఏళ్లుగా కాంగ్రెస్ కోసం నా రక్తం ధారపోశాను.
12 ఏళ్లు ఉమ్మడి జిల్లాకు డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నా.. ఎవరైనా అదృష్టం ఉంటేనే ఎమ్మెల్యే అవుతారు. దురదృష్టవంతులు ఓడిపోతారు. మంత్రి బాధ్యతారహితంగా మాట్లాడడం సరికాదు’’ అంటూ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. సొంత పార్టీ నాయకులపై బహిరంగ విమర్శలు చేసుకోవద్దని అధిష్టానం హెచ్చరిస్తుండగా.. ఇక్కడ మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయన్న చర్చ పార్టీ కేడర్‌లో జరుగుతోంది.