
దిగుమతి సుంకం రద్దు చేయొద్దు
దుగ్గొండి: కేంద్ర ప్రభుత్వం పత్తి దిగుమతిపై ఉన్న 11 శాతం దిగుమతి సుంకాన్ని రద్దు చేయొద్దని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. విదేశాలకు లాభం చేకూర్చి, దేశీయ పత్తి రైతులకు అన్యాయం చేస్తోందని పేర్కొన్నారు. ఈనెల 22న వరంగల్‌లో జరగనున్న పత్తి రైతుల సదస్సును విజయవంతం చేయాలని ముద్రించిన పోస్టర్లను సంఘం నాయకులు మంగళవారం గిర్నిబావిలో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఆగస్టు 19న పత్తి దిగుమతిపై ఇతర దేశాలకు విధించే సుంకం 11 శాతం రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించిందన్నారు. వ్యవసాయ రంగాన్ని దివాళా తీసే విధంగా కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దిగుమతి సుంకం రద్దు చేయడంతో దేశీ పత్తి రైతులకు ధర తగ్గే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంపై పోరాటానికి రైతులు సిద్ధం కావాలని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్షుడు పుచ్చకాయల బుచ్చిరెడ్డి, ప్రధాన కార్యదర్శి లడె మోహన్‌రావు, జిల్లా కమిటీ సభ్యులు బరుపటి రవీందర్, రెముడాల దామోదర్‌రెడ్డి, గుండెకారి రాజేశ్వర్‌రావు, జంగా జనార్దన్‌రెడ్డి, నల్ల విజేందర్, నర్సిరెడ్డి, కర్ణాకర్, బాపురావు, రాజన్న, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.