
వ్యాపారిపై చర్య తీసుకోవాలి
● నల్లబెల్లిలో రైతుల రాస్తారోకో
నల్లబెల్లి: నకిలీ గడ్డిమందు విక్రయించిన వ్యాపారిపై చర్య తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం మండల కేంద్రంలో వారు ఆందోళన చేసి మాట్లాడారు. మండల కేంద్రంలోని ఖాజామైనొద్దీన్ షాపులో విన్ సూపర్ పురుగుల మందును నందిగామకు చెందిన రైతు ఇస్లావత్ రాజ్‌కుమార్ రూ.1,700కు కొనుగోలు చేసి పిచికారీ చేయగా మూడెకరాల్లోని వరిపంట ఎండిపోయిందని తెలిపారు. దీంతో రైతు తీవ్రంగా నష్టపోయాడని వారు పేర్కొన్నారు. దళిత సంఘాల నాయకులు బొట్ల నరేశ్, భట్టు సాంబయ్య రాస్తారోకోలో పాల్గొని రైతులకు మద్దతు తెలిపారు. విషయం తెలుసుకున్న షాపు యజమానికి హైమద్ పాషా బాధిత రైతుకు పరిహారం అందిస్తానని, ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని వేడుకున్నాడు. నకిలీ గడ్డిమందు అంటగట్టిన షాపు యజమానిపై క్రిమినల్ కేసు నమోదు చేసి, షాపును సీజ్ చేయాలని వ్యవసాయాధికారులు కోరారు. నందిగామ, నల్లబెల్లి తదితర గ్రామాల రైతులు పాల్గొన్నారు.