
కష్టం తీరేదెన్నడు..?
ఖానాపురం: రైతన్నలకు యూరియా కష్టాలు తప్పడంలేదు.. రాత్రి, పగలు తేడా లేకుండా బారులుదీరినా.. బస్తా యూరియా దొరికే పరిస్థితిలేదు. కుటుంబమంతా క్యూలో నిలబడాల్సిన పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 1.58 లక్షల మంది రైతులు ఉండగా.. పత్తి, మొక్కజొన్న, వరి, మిర్చి, కూరగాయలతో పాటు ఇతర రకాల పంటలను సాగు చేస్తున్నారు. ఈసీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 3.10 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతుండగా.. ఇందులో 1.30 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. 1,80,000 ఎకరాల్లో పత్తి, మొక్కజొన్నతోపాటు ఇతర పంటల సాగు చేస్తున్నారు రైతులు. ఈ పంటలకు అక్టోబర్ నాటికి 37,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరముంది. ఇందులో ఆగస్టు వరకు 28,500 మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉండగా 24,509 మె.ట యూరియా మాత్రమే వచ్చింది. దీంతో రైతులు తమపంటను ఎలా కాపాడుకోవాలని ఆందోళనలో ఉన్నారు. రైతులను నానో యూరియా వైపు మళ్లించేందుకు వ్యవసాయ అధికారులు ప్రయత్నించినా రైతులు ఆసక్తి చూపుడంలేదు.
ఒక్కో బస్తా పంపిణీ..
వరి సాగు చేస్తున్న రైతులు రెండు నుంచి మూడు దఫాలుగా యూరియాను వినియోగిస్తుంటారు. ఒక్కో రైతుకు ఒక్కో బస్తా మాత్రమే పంపిణీ చేస్తుండడంతో ఎన్నిరోజులు క్యూలో నిలబడాలని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ వ్యాపారుల వద్దకు వెళితే యూరియా బస్తాతోపాటు ఇతర మందులను అంటగడుతుండడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఏ గ్రామంలో యూరియా పంపిణీ చేసినా రైతులు అర్ధరాత్రి నుంచే బారులుదీరుతున్నారు.
రోడ్డుపైన వంటావార్పు
ఖానాపురం, అశోక్‌నగర్‌కు యూరియా వస్తుందని రైతులు సొసైటీల వద్ద బుధవారం రాత్రి నుంచి బారులుదీరారు. గురువారం యూరియా రావడంలేదని తెలుసుకోని ఖానాపురం, అశోక్‌నగర్‌లో రా స్తారోకోకు దిగారు. అశోక్‌నగర్‌లో మాజీ ఎంపీపీ ప్రకాశ్‌రావు, లింగమూర్తి, సీపీఎం నాయకులు సా యిలు, రాము రైతులతో కలిసి రోడ్డుపైనే వంటా వార్పు చేపట్టారు. ఎస్సై రఘుపతి యూరియా వస్తుందని హామీ ఇవ్వడంతో విరమించారు.
తెల్లవారుజామునుంచే క్యూ..
నల్లబెల్లి: శనిగరం రైతు ఆగ్రోస్ కేంద్రం వద్ద రైతులు గురువారం తెల్లవారుజాము నుంచే బారులుదీరారు. విషయం తెలుసుకున్న మండల వ్యవసాయాధికారి రజిత టోకెన్లు పంపిణీ చేశారు.
పొద్దున్నే వచ్చి..
నెక్కొండ: మండలంలోని సూరిపల్లి, బంజరుపల్లి గ్రామాలకు యూరియా వచ్చిందని తెలిసిన రైతులు గురువారం పొద్దున్నే బారులుదీరారు. సూరిపల్లికి 400 బస్తాలు రాగా 700 మంది, బంజరుపల్లికి 100 బస్తాలురాగా.. 250 మంది యూరియా కోసం ఎగబడ్డారు. గందరగోళం మధ్య రైతుకు ఒకటి చొప్పున యూరియా బస్తాలు అందించారు.
అన్నదాతలకు తప్పని యూరియా తిప్పలు
అరకొర సరఫరాతో ఆందోళనలో రైతులు
అక్టోబర్ నాటికి 37 వేల మెట్రిక్ టన్నులు అవసరం
ఆగస్టు వరకు వచ్చింది 24,509 మెట్రిక్ టన్నులు మాత్రమే..
ఏడు బస్తాలే వచ్చాయి
వేపచెట్టుతండాలో ఏడు ఎకరాల పోడు భూమి ఉంది. పట్టా లేదు. ఇందులో పత్తి, మొక్కజొన్న వేశాను. ఖానాపురం శివారులో 20 ఎకరాలు కౌలుకు తీసుకున్నా. ఇందులో వరి సాగు చేశా. ఇప్పటి వరకు కేవలం ఏడు బస్తాల యూరియా మాత్రమే వచ్చింది. ఎప్పుడు క్యూలో నిల్చున్నా ఒక బస్తా మాత్రమే ఇస్తున్నారు. ఇంకా ఎన్ని రోజులు క్యూలో నిల్చోని బస్తాలు తీసుకోవాలో తెలియడంలేదు.
– గుగులోతు మమత, వేపచెట్టుతండా
గతంకంటే ఎక్కువ ఇచ్చాం
జిల్లాలో యూరియా ఎప్పటికప్పుడు అందజేస్తున్నం. గతంలో కంటే ప్రస్తుతం 4 వేల మెట్రిక్ టన్నులు అధికంగా ఇచ్చాం. ప్రస్తుతం ఇండెంట్‌లు కూడా పెట్టాం. ప్రస్తుతం మన జిల్లాకు యూరియా ఎక్కువ కేటాయించే అవకాశం ఉంది. పత్తి పంటలకు రైతులు పైపాటుగా నానో యూరియాను వాడుకోవాలి. రైతులు క్యూలో ఉండాల్సిన అవసరం లేదు.
– అనురాధ, జిల్లా వ్యవసాయాధికారి

కష్టం తీరేదెన్నడు..?