
ఎఫ్‌పీఓలుగా పీఏసీఎస్‌లు
హన్మకొండ: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ (రైతు ఉత్పాదక సంస్థ)లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. రైతు ఉత్పత్తులకు లాభదాయక ధరలు అందించి ప్రస్తుత ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను బలోపేతం చేయడమే వీటి లక్ష్యం. రైతుల ప్రయోజనాలను బలోపేతం చేయడం లక్ష్యంగా ఎఫ్‌పీఓలు పనిచేస్తాయి. హనుమకొండ జిల్లాలో మొత్తం 16 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలున్నాయి. మొదటి దశలో ఏడు సంఘాలు రైతు ఉత్పాదక సంస్థ (ఎఫ్‌డీఓ)లుగా ఎంపికయ్యాయి. మలిదశలో మిగతా సంఘాలు ఎంపిక చేస్తారు. కమలాపూర్, పెంచికలపేట, దామెర, పెద్దాపూర్, శాయంపేట, ధర్మసాగర్, దర్గా కాజీపేట పీఏసీఎస్‌లు ఎఫ్‌పీఓలుగా ఎంపికయ్యాయి. ఈ సంఘాలు రూ.2 వేల చొప్పున వాటాధనం తీసుకుని 750 మందిని సభ్యులుగా చేర్చుకోవాలి. ఈ మొత్తం రూ.15 లక్షలవుతుంది. జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్‌సీడీఎస్) ఒక్కో సభ్యుడికి మరో రూ.2 వేల చొప్పున వాటాధనం చెల్లించడం ద్వారా రూ.15 లక్షలు గ్రాంట్‌గా పీఏసీఎస్‌లకు అందిస్తుంది. పెంచికలపేట, దర్గాకాజీపేట పీఏసీఎస్‌ల వాటాధనం రూ.15 లక్షలు రైతుల నుంచి సమకూర్చుకున్నాయి. మిగతా సంఘాలు సగం వరకు వాటాధనం సమకూర్చుని లక్ష్యం వైపు ముందుకు పోతున్నాయి. ఎఫ్‌పీఓలుగా ఎంపికై న సంఘాలకు కేంద్రం ఏడాదికి రూ.6 లక్షల చొప్పున మూడు సంవత్సరాలకు రూ.18 లక్షల సహాయాన్ని అందిస్తుంది. జాతీయ సహకార అభివృద్ధి సంస్థ వ్యవస్థాపక సౌకర్యాల కోసం రూ.2 కోట్ల రుణాన్ని నామ మాత్రపు రుణాన్ని అందిస్తుంది. శాయంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం రూ.90 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సొంత భవనం పూర్తి కావొచ్చింది.
ఆదాయాన్ని
సమకూర్చుకుంటున్న పీఏసీఎస్‌లు..
రైతుల పంట ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడం, ప్రాసెసింగ్, బ్రాండింగ్ చేయడం ద్వారా రైతు ఉత్పత్తులకు లాభదాయం ధర సాధించడం, వ్యవస్థాపక సౌకర్యం కల్పించడం ఎఫ్‌పీఓల విధి. గోడౌన్, డ్రైయాడ్, డ్రైహెడ్స్ వంటి సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎఫ్‌పీఓలు రైతులు ప్రకృతి, సేంద్రియ వ్యవసాయం చేసేలా ప్రోత్సహిస్తాయి. ఆరోగ్య రక్షణ కల్పించి రైతులను ప్రాణదాతలుగా తీర్చిదిద్దుతాయి. ఎఫ్‌పీఓల ద్వారా కామన్ సర్వీస్ సెంటర్ సేవలు, జన ఔషధి, కర్షక్ వికాస్ సెంటర్ల నిర్వహణ, ఎరువుల విక్రయాలు చేపడతాయి. తద్వారా ప్రజలకు సేవలు అందించడంతోపాటు ఆర్థికంగా ఆదాయాన్ని సమకూర్చుకుంటాయి. ఇప్పటి వరకు కేవలం రైతులకు రుణాలివ్వడం, వసూళ్లకు పరిమితమైన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు.. ప్రస్తుతం ఎరువుల విక్రయాలు, ధాన్యం కొనుగోళ్లతో అదనపు ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాయి.
ఎఫ్‌పీఓలుగా పీఏసీఎస్‌లు బలోపేతం..
ఎఫ్‌పీఓల ఏర్పాటు ద్వారా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు మరింత బలోపేతం అవుతాయి. వ్యాపారాల విస్తరణ, రైతు ఉత్పత్తుల మార్కెటింగ్ ద్వారా ఆదాయం పెంచుకోవడం ద్వారా సంఘాలు ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తాయి. ఎఫ్‌పీఓల ద్వారా రైతులకు, ప్రజలకు సేవలు చేరువవడంతో పాటు సంఘాలు ఆర్థిక పరిపుష్టి సాధిస్తాయి.
– బి.సంజీవరెడ్డి, జిల్లా సహకార అధికారి
జిల్లాలో 7 ప్రాథమిక వ్యవసాయ
సహకార సంఘాల ఎంపిక
రైతుల ఆదాయం పెంపే లక్ష్యం..
కేంద్ర ప్రభుత్వం సాయం

ఎఫ్‌పీఓలుగా పీఏసీఎస్‌లు