
కొండపర్తిలో రైతుల ఆగ్రహం
నానో యూరియాతో లింక్ పెట్టొద్దని నిరసన
ఐనవోలు: యూరియా పంపిణీకి నానో యూరియాతో లింక్ పెట్టొద్దని మండలంలోని కొండపర్తి గ్రామస్తులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మండలంలోని కొండపర్తిలో దర్గా పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొండపర్తి, నర్సింహులగూడెం, ముల్కలగూడెం గ్రామాల రైతులకు యూరియా పంపిణీ చేస్తారనే సమాచారంతో రైతులు ఉదయం నుంచే పెద్ద ఎత్తున బారులుదీరారు. మూడు గ్రామాల రైతులతో పాటు మరికొంత మంది అక్కడికి చేరుకున్నారు. 20 టన్నుల యూరియా 440 బస్తాలు కేంద్రంలో ఉండగా.. రైతులకు ఒక్కో బస్తా చొప్పున ఇవ్వడం మొదలుపెట్టారు. నిర్వాహకులు ఒక బస్తా యూరియాకు.. రూ.200 విలువైన అర లీటర్ లిక్విడ్ నానో యూరియా బాటిల్ తప్పనిసరిగా తీసుకోవాలని లింక్ పెట్టడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నానో యూరియా బాటిల్ తీసుకోని వారికి యూరియా ఇవ్వమని చెప్పడంతో రైతులు నానోబాటిళ్లను ధ్వంసం చేసి నిరసన వ్యక్తం చేశారు. యూరియా పంపిణీని నిలిపేసి సొసైటీ నిర్వాహకులకు, ఉన్నతాధికారులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఏడీఏ ఆదిరెడ్డి, సీఐ రాజగోపాల్, ఎస్సై పస్తం శ్రీనివాస్, సొసైటీ వైస్ చైర్మన్ మాదాసు బాబు యూరియా పంపిణీ కేంద్రానికి చేరుకున్నారు. పోలీసులు, వ్యవసాయ అధికారులు రైతులతో మాట్లాడి చివరికి నానో యూరియా లిక్విడ్ బాటిల్ లేకుండా రైతులకు టోకెన్లు అందించి రాత్రి 8 గంటల వరకు యూరియాను పంపిణీ చేశారు.