
యూరియా కోసం రైతుల ధర్నా
పరకాల: యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అర్ధరాత్రి నుంచే పీఏసీఎస్‌లు, రైతు వేదికల ఎదుట బారులుదీరుతున్నారు. క్యూలో నిల్చున్న వారందరికీ యూరియా దొరకడం లేదు. రెండు రోజుల క్రితం మాదారం పీఏసీఎస్‌కు 440 బస్తాల యూరియా వచ్చింది. కొంతమంది రైతులకు పంపిణీ చేసి మిగిలిన వారికి అధికారులు టోకెన్లు ఇచ్చారు. మరుసటి రోజు ఇస్తామని చెప్పడంతో బుధవారం రైతులు పరకాల వ్యవసాయ మార్కెట్‌కు చేరుకున్నారు. నాగారం, పైడిపల్లి రైతులకు పంపిణీ చేశారు. టోకెన్లు ఇచ్చిన నడికూడ మండల రైతులకు గురువారం యూరియా పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు. దీంతో వారు ఆగ్రహం వ్యక్తం చేసి వ్యవసాయ మార్కెట్ ప్రధాన రహదారిపై ధర్నా చేశారు. యూరియా కావాలని, ప్రభుత్వం నిరక్ష్యం వీడాలని నినాదాలు చేశారు. గంటపాటు రెండు కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు వారిని బలవంతంగా తీసుకెళ్లి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.
పరకాల వ్యవసాయ మార్కెట్ ఎదుట ఆందోళన
రెండు కిలోమీటర్ల మేర నిలిచిన
వాహనాల రాకపోకలు