
ఫలితాలు శూన్యం!
ప్రయత్నాలు వినూత్నం..
● ఫిర్యాదుదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న కలెక్టర్ సత్యశారద
● ఆతర్వాతే అర్జీల స్వీకరణ
● సత్వరమే పరిష్కరించాలని ఆదేశం
న్యూశాయంపేట: ప్రజావాణిలో గత రెండు, మూడు వారాలుగా ఉన్నతాధికారులు వినూత్న ఆలోచనతో ఫిర్యాదుదారుల సమస్యల్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక వారం అధికారులు కలెక్టర్ వెనుకాల కూర్చోగా.. ఎదురుగా ఫిర్యాదు దారులు కూర్చున్నారు. సమస్యల్ని అధికారులకు వివరించారు. ఈవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ముందుగా అర్జీదారులందరితో మాట్లాడించారు. సమస్యలను అక్కడున్న సంబంధిత అధికారులకు వివరించే ప్రయత్నం చేశారు. ఉన్నతాధికారుల ఆలోచనలు బాగున్నప్పటికీ.. కింది స్థాయి అధికారులు ప్రజల వినతులను పరిష్కరించేందుకు శ్రద్ధ చూపడం లేదని ఫిర్యాదుదారులు వాపోతున్నారు. ఆలోచనలు సరే ఆచరణేది? అంటూ అర్జీదారులు ప్రశ్నిస్తున్నారు. తమ సమస్యకు పరిష్కారం చూపాలని వారంతా కోరుతున్నారు..
వినతులు సత్వరమే పరిష్కరించండి
ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తుల్ని సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల ఫిర్యాదులను కలెక్టర్ స్వయంగా స్వీకరించి పరిష్కార నిమిత్తం ఆయా శాఖల అధికారులకు అందజేశారు. ప్రజావాణిలో 136 ఫిర్యాదులు రాగా.. అధికంగా రెవెన్యూ సమస్యలు 60, జీడబ్ల్యూఎంసీ 21, విద్యాశాఖ 11, సహకార శాఖ 9, గృహ నిర్మాణ శాఖ 7, వైద్య ఆరోగ్యశాఖ, ఉపాధికల్పన శాఖలకు 3 చొప్పున, ఇతర శాఖలకు సంబంధించి 22 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. ఫిర్యాదుల్ని సకాలంలో చర్యలను తీసుకోవాలని, చేపట్టిన చర్యలను వివరిస్తూ ఫిర్యాదుదారులకు సమాచారం తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, డీఏఓ అనురాధ, డీఎంహెచ్‌ఓ సాంబశివరావు, గృహనిర్మాణ శాఖ పీడీ గణపతి, డీసీఓ రాజమణి, ఆర్డీఓలు సత్యపాల్‌రెడ్డి, ఉమారాణి, ఆర్సీఓ అపర్ణ, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దారులు, విభాగాల పర్యవేక్షకులు పాల్గొన్నారు.