
పగలనకా.. రాత్రనక
● యూరియా కోసం బారులుదీరుతున్న రైతులు
● ఉద్రిక్తతల నడుమ టోకెన్ల పంపిణీ
● లైన్‌లో ఉండగా.. ఓ రైతుకు ఫిట్స్
ఖానాపురం: పగలు, రాత్రి తేడా లేదు. ఆకలి దప్పిక అస్సలు ఎరుగరు. ఎక్కడ చూసినా బారులే. ఏ రైతును కదిలించినా యూరియా కష్టాలే. ఒక్క బస్తాకోసం రోజుల తరబడి ఎదురు చూపులు. పంటను కాపాడుకునేందుకు రైతన్నలు తమ ఆరోగ్యాల్ని ఫణంగా పెడుతున్నారు. ఎండా వాన తేడా లేకుండా ఎరువుల కోసం పీఏసీఎస్‌ల చుట్టూ తిరుగుతున్నారు.
తప్పని తిప్పలు
ఖానాపురం మండలంలోని రంగాపురం, కొత్తూరు, రాగంపేట, ఖానాపురం, మనుబోతులగడ్డ గ్రామాల్లో యూరియా కష్టాలు రైతులకు తప్పలేదు. ఆయా గ్రామాలకు యూరియా వస్తున్న విషయం తెలుసుకున్న రైతులు రాత్రి 2 గంటల నుంచే రైతువేదికలు, గ్రామ పంచాయతీల వద్ద బారులుదీరారు. రంగాపురం, కొత్తూరు, మనుబోతులగడ్డకు చెందిన రైతులు మొదట ఖానాపురానికి రాత్రి 1 గంటకు వచ్చి బారులుదీరారు. ఖానాపురంలో ఆయా గ్రామాలకు ఇవ్వడంలేదని, కొత్తూరు, మనుబోతులగడ్డ సొసైటీ గోదాంకు వస్తుందని తెలియడంతో అక్కడికి వెళ్లి లైన్‌లో నిల్చున్నారు. ఈక్రమంలో క్యూలో నిల్చున్న రైతు లావుడ్య యాకూబ్ ఫిట్స్‌తో కిందపడిపోయాడు. ఖానాపురం, రాగంపేట, మనుబోతులగడ్డలోనూ అధిక సంఖ్యలో బారులుదీరారు. టోకెన్ల కోసం మహిళల మధ్య తోపులాట జరిగింది. విషయం తెలుసుకున్న ఎస్సై రఘుపతి ఘటనా స్థలానికి చేరుకుని రైతులను లైన్‌లో నిల్చోబెట్టారు. టోకెన్లు లభించిన రైతులు బస్తాలను ఇంటికి తీసుకెళ్లారు. క్యూలో ఉన్న రైతులకు యూరియా లభించక నిరాశతో వెనుదిరిగారు.

పగలనకా.. రాత్రనక

పగలనకా.. రాత్రనక