
యూరియా కోసం రైతుల ఆరాటం
నల్లబెల్లి: యూరియా బస్తాల కోసం మండలంలోని నల్లబెల్లి పీఏసీఎస్ సొసైటీ, రాంపూర్ రైతుల వేదికల్లో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే నల్లబెల్లి పీఏసీఎస్, మేడపల్లి రైతు వేదికల్లో యూరియా బస్తాల కోసం రైతులు క్యూలో నిల్చున్నారు. నిర్వాహకులు ప్రతి రైతుకు ఒకటే బస్తా ఇవ్వడంతో రైతులు ఆందోళన చెందారు. క్యూలో నిల్చున్న రైతులకు బస్తాలు అందకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. నల్లబెల్లి, మేడపల్లి పీఏసీఎస్ కేంద్రాల్లో 20 మెట్రిక్ టన్నుల చొప్పున యూరియా పంపిణీ చేశారు. యారియా అయిపోగానే రైతులు ఒక్కసారిగా సొసైటీలోకి దూసుకొచ్చారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మేడపల్లికి చేరుకొని రైతులతో మాట్లాడారు. రైతులతో కలిసి నిరసన చేపట్టారు. రైతులకు పూర్తి స్థాయిలో యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెవెళ్లడంతో మేడపల్లి, నల్లబెల్లిలో రైతులకు సిబ్బంది టోకన్లు పంపిణీ చేశారు. నల్లబెల్లిలో టోకెన్లు పంపిణీ చేస్తున్న ఎస్సై పైకి రైతులు ఒక్కసారిగా దూసుకొచ్చారు. ఒకటి రెండు రోజుల్లో వచ్చే యూరియా పంపిణీలో ప్రాధాన్యత కల్పిస్తామని భరోసా కల్పిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.