
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ కుట్ర
హన్మకొండ చౌరస్తా : బీడు భూములకు సాగునీరిచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని మాజీ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం హనుమకొండ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి భారీ ధర్నా చేపట్టారు. అంతకుముందు బాలసముద్రంలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయం నుంచి కాళోజీ జంక్షన్, అంబేడ్కర్ జంక్షన్, పబ్లిక్‌గార్డెన్, అశోకా జంక్షన్ మీదుగా హనుమకొండ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం నిర్వహించిన ధర్నాను ఉద్దేశించి వినయ్‌భాస్కర్ మాట్లాడారు. చరిత్రలో నిలిచిపోయేలా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో 3 పిల్లర్లు కుంగాయని రాద్ధాంతం చేస్తున్నారని దుయ్యబట్టారు. కమీషన్ల పేరుతో కేసీఆర్‌పై కాంగ్రెస్ బురద జల్లే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. హనుమకొండ చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు బీఆర్‌ఎస్ నాయకులు ముందుకు రాగా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశా రు. ఈక్రమంలో పోలీసులకు, బీఆర్‌ఎస్ నాయకుల మధ్య తోపులాట జరిగింది. ఉద్రిక్తతల నడు మ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో కుడా మాజీ చైర్మన్ యాదవరెడ్డి, బీఆర్‌ఎస్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్ పులి రజనీ కాంత్, కార్పొరేటర్లు నర్సింగరావు, కిరణ్, మధు, నాయకులు రమేష్, పున్నంచందర్, వెంకన్న, రమేశ్, శ్రీనివాస్, సునీల్, విక్టరీబాబు పాల్గొన్నారు.
మాజీ చీఫ్‌విప్ వినయ్‌భాస్కర్
సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం, అడ్డుకున్న పోలీసులు