విద్యారణ్యపురి : జిల్లాలోని ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు తమతమ విద్యార్థుల ఇన్‌స్పైర్ నామినేషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని హనుమకొండ డీఈఓ డి.వాసంతి కోరారు. సోమవారం తన కార్యాలయంలో జిల్లా సైన్స్ అధికారి ఎస్.శ్రీనివాసస్వామితో పాటు మండల కోఆర్డినేటర్లతో ఆమె సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈనెల 15వ తేదీవరకు తుదిగడువు ఉందని, 6వ తరగతినుంచి 10వ తరగతి విద్యార్థులతోపాటు 11, 12 తరగతుల విద్యార్థుల నామినేషన్లను కూడా పంపాలని సూచించారు.
గూడ్స్ షెడ్‌కు యూరియా రాక
ఖిలా వరంగల్: వరంగల్ గూడ్స్ షెడ్‌కు సోమవారం ఉదయం ఎన్‌ఎఫ్‌ఎల్ 26,23,590 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది. కలెక్టర్ సత్యశారద ఆదేశాలు, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ సూచనల మేరకు వ్యవసాయ అధికారులు నర్సింగం (ఏడీఏ), ఏఓలు రవీందర్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి, విజ్ఞాన్.. కంపెనీ ప్రతినిధులతో కలిసి రికార్డుల ప్రకారం యూరియాను పరిశీలించారు. రైలు వ్యాగన్ ద్వారా చేరిన యూరియాను 60శాతం మార్క్‌ఫెడ్‌కు, 40శాతం ఫర్టిలైజర్ డీలర్లకు కేటాయించారు. లారీల ద్వారా జిల్లాలోని పీఏసీఎస్, ఫర్టిలైజర్ డీలర్ల షాపులకు యుద్ధప్రాతిపదికన తరలింపులో అధికారులు నిమగ్నమయ్యారు. ప్రధానంగా వరంగల్ జిల్లాలో యూరియా కొరత ఎక్కువగా ఉండడంతో తొలుత డిమాండ్ ఉన్న ప్రాంతాలకు పంపించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఖిలా వరంగల్ మండల వ్యవసాయ అధికారి రవీందర్‌రెడ్డి తెలిపారు.
హన్మకొండ కల్చరల్ : రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల ఆలయంలో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి మహోత్సవాలు సోమవారం ఆరోరోజు చేరుకున్నాయి. ఇందులో భాగంగా మూలమహాగణపతిని శ్రీహేరంబ గణపతిగా అలంకరించారు. ఆలయ ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో రుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం, పూజలు మూలగణపతిని గంధవిలేపనాలు అద్ది చతుర్ముఖాలతో శ్రీహేరంబ గణపతిగా అలంకరించి పూజలు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. విహారయాత్రలో భాగంగా విశాఖపట్నానికి చెందిన పాఠశాల విద్యార్థులు దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు, భక్తులకు అన్నప్రసాదాల వితరణ చేశారు. సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో టీటీడీ ఆధ్వర్యంలో భక్తిగీతాలు, భజనలు అలరించాయి.
108 రకాల పిండివంటలతో నైవేద్యం
కాజీపేట : కాజీపేట 63వ డివిజన్ జూబ్లీమార్కెట్ ఆవరణలోని దక్షిణ ముఖ ఆభయాంజనేయ స్వామి ఆలయంలో కొలువుదీరిన వినాయకుడికి సోమవారం భక్తులు 108 రకాల పిండి వంటలతో మహా నైవేద్యం సమర్పించారు. అర్చకుడు శ్రీనివాస్ శర్మ పర్యవేక్షణలో భక్తులు గణనాథుడికి పూజలు చేశారు.
వరంగల్ క్రైం : వరంగల్ పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయంలో సీపీని కలిసేందుకు వచ్చే సందర్శకుల కోసం లాంజ్‌ని ఏర్పాటు చేయగా సీపీ సన్‌ప్రీత్ సింగ్ సోమవారం ప్రారంభించారు. సందర్శకులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ఈ లాంజ్ ఏర్పాటు చేసినట్లు సిట్టింగ్, తాగునీరు, పత్రికలు వంటి అవసరమైన సౌకర్యాలు కల్పించినట్లు ఆయన తెలిపారు. ప్రజలు పో లీస్ కార్యాలయానికి వచ్చే సందర్భంలో వేచి ఉండే సమయంలో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఈ లాంజ్ ఉపయోగపడుతుందన్నారు. అదనపు డీసీపీలు రవి, ప్రభాకర్ రావు, శ్రీనివాస్, ఏసీపీలు జితేందర్ రెడ్డి, నాగయ్య, డేవిడ్ రాజు, సిబ్బంది పాల్గొన్నారు.