
రూ.40 కోట్లతో డ్రెయినేజీల నిర్మాణం
పరకాల: గత పాలకుల వైఖరి, నిర్లక్ష్యంతోనే పరకాల జిల్లా కేంద్రం కాలేదని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో జేసీబీ, స్వచ్ఛ వాహనాలను ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కలెక్టర్ స్నేహ శబరీశ్ మంగళవారం ప్రారంభించారు. మున్సిపల్ కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం మహిళా సంఘాల స్టాళ్లను సందర్శించారు. వనమహోత్సవంలో భాగంగా అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ పరకాలలో సిల్క్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామని, త్వరలో సెట్విన్ రానుందన్నారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నామని, రూ.40 కోట్లతో డ్రెయినేజీలు నిర్మిస్తున్నామని, రూ.11 కోట్లతో రోడ్లను అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. కలెక్టర్ స్నేహ శబరీశ్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, పట్టణాభివృద్ధిలో ప్రజల సహకారం చాలా అవసరమని అన్నారు. అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కె.సుష్మ, ఆర్డీఓ డాక్టర్ కె.నారాయణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి, తహసీల్దార్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
గత పాలకుల నిర్లక్ష్యంతోనే
జిల్లా కేంద్రంగా మారని పరకాల
స్వచ్ఛ వాహనాల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి