
ఆర్‌అండ్‌బీ రోడ్లకు మహర్దశ
ఉమ్మడి వరంగల్ జిల్లాకు
రూ.617.21 కోట్లు
● 589 కిమీ 49 హ్యామ్ రోడ్ల ఉన్నతీకరణకు నిధులు
● హనుమకొండ, భూపాలపల్లి సర్కిళ్ల పర్యవేక్షణ
● పల్లెల నుంచి పట్టణాలకు మెరుగవనున్న కనెక్టివిటీ
● హైదరాబాద్‌ను కలిపే జిల్లా, మండల కేంద్రం రోడ్లకు నిధులు
సాక్షిప్రతినిధి, వరంగల్:
రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టే హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) రోడ్లతో ఉమ్మడి వరంగల్‌కు కొత్త కళ రానుంది. హ్యామ్ మొదటి దశలో తెలంగాణ వ్యాప్తంగా 17 ప్యాకేజీల వారీగా మొత్తం 373 రోడ్ల పనులకు ప్రభుత్వం రూ.6,478.33 కోట్లు కేటాయించింది. ఇందులో భాగంగా ఆర్‌అండ్‌బీ ఉమ్మడి వరంగల్‌లోని హనుమకొండ, భూపాలపల్లి సర్కిళ్లకు 588.65 కిలోమీటర్ల రోడ్ల కోసం రూ.617.21 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో 49 రోడ్లకు మహర్దశ పట్టనుండగా.. 588.65 కిలోమీటర్ల మేర హ్యామ్ విధానంలో రోడ్లను ఉన్నతీకరించనున్నారు.
‘హ్యామ్’ విధానం ఇలా..
రోడ్లు ఎక్కడెక్కడంటే..
హ్యామ్ విధానంలో మేజర్ రోడ్లయితే 60 శాతం నిధులను ఉమ్మడి జిల్లాలో టెండర్ల ద్వారా పనులు పొందిన గుత్తేదారు సంస్థలే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఆ సొమ్మును వాయిదాల పద్ధతిలో చెల్లిస్తుంది. మిగిలిన 40 శాతం నిధులు కూడా దశలవారీగా విడుదల చేసే అవకాశం ఉంది. పెద్దగా ఆర్థిక భారం లేకుండానే రోడ్లను అభివృద్ధి చేసేందుకే ఈ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని ఆర్‌అండ్‌బీ అధికారులు చెబుతున్నారు. కాగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండు సర్కిళ్ల పరిధిలో 49 పనులకు రూ.617.21 కోట్లు కేటాయించగా.. గ్రామీణ ప్రధాన రహదారుల ఉన్నతీకరణతో పాటు పల్లెల నుంచి మండల కేంద్రం, జిల్లా కేంద్రాలకు కనెక్టివిటీ ఉన్న రోడ్లకు మహర్దశ పట్టనుంది. ఇదిలా ఉండగా 49 రోడ్లలో ప్రధానంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని హైదరాబాద్ నుంచి హనుమకొండ రోడ్డు (ఓల్డ్ ఎన్‌హెచ్–163) (జీడబ్ల్యూఎంసీ పరిధి)ను 14 కిమీ మేర అభివృద్ధి చేసి, విస్తరించనున్నారు. కాజీపేట నుంచి పెద్దమ్మగడ్డ రోడ్డు (కాజీపేట, ఫాతిమానగర్, వడ్డేపల్లి, కాకతీయ యూనివర్సిటీ, పెద్దమ్మగడ్డ) 9.47 కిమీ రోడ్డుకు సుమారు రూ.20 కోట్లకు పైగా మంజూరు చేశారు. ఆత్మకూరు నుంచి పరకాల వయా శాయంపేట, పెద్దకోడెపాక వరకు ఒకటి 3 కిమీ, మరోటి 11 కిమీ కలిపి మొత్తం 14 కిమీ ఉన్నతీకరించనున్నారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో వర్ధన్నపేట టు కక్కిరాలపల్లి (వర్ధన్నపేట, నందనం, రాంనగర్, కక్కిరాలపల్లి) వరకు 14.50 కిమీ రోడ్డుకు మహర్దశ పట్టనుంది. స్టేషన్‌ఘన్‌పూర్‌లో మడికొండ నుంచి నారాయణగిరి (ఎలుకుర్తి, ముప్పారం, నారాయణగిరి) రోడ్డు 10.50 కిమీ మేర బలోపేతం చేసేందుకు నిధులు కేటాయించారు. మహబూబాబాద్ నియోజకవర్గంలో కేసముద్రం–నెల్లికుదురు రోడ్డు (కేసముద్రం, భూక్యారాం తండా, మహమూద్‌పట్నం, ఇనుగుర్తి, చిన్న గంగారం, తారాసింగ్‌బాయి తండా, భూక్యాదన్యతండా, సపావత్ తండా, భోజ్యతండాను కలిపే)ను 20.60 కిమీ మేర అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేశారు. ఇలా ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా మొదటి విడతలో మొత్తం 49 రోడ్ల కోసం రూ.617.21 కోట్లు ఖర్చు చేయనుండగా.. ఈ నిధులతో మండలం, జిల్లా కేంద్రాలను కలిపే పల్లెరోడ్లు కళకళలాడనున్నాయి.
సర్కిళ్ల వారీగా పనులు, నిధులు, పర్యవేక్షణ..
రోడ్లను అభివృద్ధి చేయడంతోపాటు ఒక వరుస రోడ్లను రెండు వరుసలుగా విస్తరించేందుకు కూడా నిధులు మంజూరు చేశారు. అయితే కొత్తగా ఏర్పడిన సర్కిళ్ల వారీగానే టెండర్లు, పనుల పర్యవేక్షణ జరుగుతోంది. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో హనుమకొండ, భూపాలపల్లి సర్కిళ్లు ఉండగా.. హనుమకొండకు 394.42 కిమీ మేర 39 రోడ్ల ఉన్నతీకరణ కోసం రూ.467.90 కోట్లు కేటాయించారు. భూపాలపల్లి సర్కిల్ పరిధిలో 10 రోడ్లను 194.23 కిమీ మేర అభివృద్ధి, విస్తరణ కోసం రూ.249.31 కోట్లు విడుదల చేశారు. హ్యామ్ రోడ్లపై ఏర్పాటు చేసిన కన్సల్టెన్సీ సంస్థ సూచన మేరకు ఆర్‌అండ్‌బీ సర్కిల్ వారీగా టెండర్లు పిలవాలని ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వుల జారీ చేసింది. హ్యామ్ రోడ్ల నిర్మాణానికి నేషనల్ హైవేలకు సంబంధించిన నిబంధనలే వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే ఆ రోడ్లకు ఖర్చు చేసిన నిధులను కాంట్రాక్టు సంస్థలు టోల్‌ప్లాజా ద్వారా వసూలు చేసుకునే వెసులుబాటు ఉండగా.. ఇక్కడ చేపట్టే హ్యామ్ రోడ్లకు మాత్రం టోల్‌ట్యాక్స్ అనేది ఉండదు. ఆ రోడ్ల నిర్వహణ బాధ్యతను కూడా సదరు గుత్తేదారు సంస్థే అగ్రిమెంట్ ప్రకారం చూసుకోవాల్సి ఉంటుందని సూచించారు.